10-08-2024 04:20:06 AM
అనంతరం సమస్యలపై వినతిపత్రం అందజేత
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): గ్రేటర్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణను సక్రమంగా చేపట్టడం లేదంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ అండ్ రిక్షా కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. అనంతరం ప్రధాన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి ఫిర్యాదు, వినతిపత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ ఆటో టిప్పర్ అండ్ రిక్షా కార్మికుల యూనియన్ అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. మేము ప్రతిరోజు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేపడుతున్నామని.. కమిషనర్ మాపై అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావడం లేదన్నారు. అలాగే చెత్త సేకరణలో సెకండరీ పాయింట్స్ వద్ద స్వచ్ఛ ఆటో కార్మికులు ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రాంకీ సంస్థ కారణంగా స్వచ్ఛ ఆటో కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరినట్టు తెలిపారు.
అలాగే కమర్షియల్ ప్రాంతాల్లో చెత్త సేకరణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. తాను దురుద్దేశ్య పూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తన వ్యాఖ్యలను కొందరు మిస్ అండర్ స్టాండ్ చేసుకున్నారని అన్నారు. స్వచ్ఛ ఆటో కార్మికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు.