06-12-2025 12:00:00 AM
* ఫత్తేపూర్లో రెండు వర్గాల మధ్య గొడవ
* చెదరగొట్టిన పోలీసులు
కల్హేర్ (సిర్గాపూర్), డిసెంబర్ 5 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఓ కులానికి చెందిన ఓట్లను కొనుగోలు చేయడానికి వేలం పాట నిర్వహించగా ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసులు నమోదు చేస్తామని ఇరువర్గాలను చెదరగొట్టారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని ఫత్తేపూర్ లో సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్ రిజర్వు అయ్యింది.
బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి తనకే గంపగుత్తగా మెజారిటీ ఓట్లు పొందేందుకు యాదవ సంఘం నేతలతో కలిసి వేలం పాట జరిపారని సమాచారం. కాంగ్రెస్ బలపర్చిన మరో అభ్యర్థి ఇతర కుల సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు రూ.9.5 లక్షల వరకు వేలం జరిపారు. దీంతో గ్రామంలో మెజారిటీ ఓట్లు ఉన్న కుల సంఘం, ఇతర కుల సంఘాల మధ్య గొడవకు దారితీసింది. విషయం తెలుసుకున్న కల్హేర్ పోలీసులు గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు.