03-05-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ మే 2 (విజయ క్రాంతి) : వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మాయమాటలు చెప్పి రైతులను ఇబ్బందుల గురి చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం హన్వాడ మండల కేంద్రం లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి అయిందని, పది శాతం కాలువల పనులకు టెండర్లను పిలిస్తే ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని విమర్శించారు.
వట్టెం.. కర్వెన.. ఏదుల పూర్తి కావడం జరిగిందని, కాలువల కోసం టెండర్లను పిలుస్తే వాటిని రద్దు చేశారని విమర్శించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి దారుణంగా ఉందని, వరి కొనుగోలు చేసేందుకు అనేక కొర్రీలు పెడుతున్నారని పేర్కొన్నారు.
వడగండ్ల వానకు నష్ట పోయిన వరికి ఎకరాకు రూ. 40 వేల నష్ట పరిహారం ఇవ్వాలని, ఎన్నికల్లో యిచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని చేశామని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ నరేందర్, సీనియర్ నాయకులు వెంకటయ్య, కొండా లక్ష్మయ్య, శ్రీనివాసులు, అనంత రెడ్డి, మాధవులు తదితరులు పాల్గొన్నారు.