కదలరు.. మెదలరూ!?
- యథేచ్ఛగా అక్రమ నిర్మాణాల దందా
- ఖానాపూర్ నుంచి బుల్కాపురా వరకు భారీ షెడ్ల నిర్మాణాలు
- జీవో 111 నిబంధనలకు బేఖాతరు.. అడ్డూ అదుపూ లేని అక్రమ దందా
- ఫిర్యాదులు, కథనాలు బేఖాతరు.. మరింత రెచ్చిపోతున్న అక్రమార్కులు
- పట్టించుకోని అధికారులు
- ఉన్నతాధికారుల మౌనంపైనా అనుమానాలు
- సమగ్ర విచారణకు డిమాండ్
విజయక్రాంతి, నిఘా విభాగం, నవంబర్ 14 : జీవో 111 నిబంధనలు, భూగర్భ జలాల సంరక్షణ(Conservation of Groundwater), అక్రమ నిర్మాణాలపై విజయక్రాంతి దినపత్రిక వరుస కథనాలు ప్రచురిస్తున్నప్పటికీ సంబంధిత అధికారుల్లో చలనం కనిపించడం లేదు. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాల దందా మాత్రం ఆగడం లేదు. ఖానాపూర్, జొన్నాడ, మీర్జాగూడ, గౌలిదొడ్డి, బుల్కాపురా ప్రాంతాల్లో భారీ కమర్షియల్ షెడ్లు, గోదాముల నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
రహదారుల పక్కనే భారీ నిర్మాణాలు చేపడుతున్నా రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బుల్కాపురా ప్రాంతంలో జరుగుతున్న భారీ షెడ్ల నిర్మాణాల వ్యవహారంలో చైన్‌మెన్ సాయిరెడ్డి పాత్రపై స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో నిర్మాణాల వ్యవహారంలో ఆయన చెప్పిందే నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలోనూ నార్సింగి సర్కిల్-45 పరిధిలో అక్రమ నిర్మాణాలు, కమర్షియల్ షెడ్ల వ్యవహారంలో ఆయన పాత్రపై ఆరోపణలు వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ లేనందున సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.
నిబంధనలు పక్కకు..
మరోవైపు జీవో 111 పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణాల చట్టబద్ధత, భూ వినియోగ మార్పులు, అనుమతులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణే లక్ష్యంగా తీసుకొచ్చిన నిబంధనలను పక్కనపెట్టి వాణిజ్య నిర్మాణాలు చేపడుతున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో భూగర్భ జలాల సంరక్షణ కోసం ప్రభుత్వం జీవో 259 ద్వారా కొత్త బోర్లపై ఆంక్షలు విధించడంతోపాటు నిర్మాణ అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించాలని ఆదేశించింది.
అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలకు నీటిని ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నారు? అనుమతులు లేకుండా బోర్లు వేస్తున్నారా? అన్న అంశాలపై అధికారులు తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయక్రాంతి కథనాలపై స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అధికారులు మౌనం వహించడం వెనుక కారణాలేమిటన్నది అంతుచిక్కడం లేదు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఖానాపూర్ నుంచి బుల్కాపురా వరకు జరుగుతున్న నిర్మాణాలపై సంయుక్త తనిఖీలు నిర్వహించి, సర్వే నంబర్లు, భూముల స్వభావం, నిర్మాణ అనుమతులు, భూ వినియోగ మార్పులను పరిశీలించాలి. చైన్‌మెన్ సాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపైనా నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలి. పత్రికల్లో కథనాలు వచ్చినా, ప్రజలు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోతే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు? బాధ్యులపై చర్యలు తీసుకునేది ఎప్పుడు? అన్న ప్రశ్నలకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలి.