విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధన
కోనరావుపేట నవంబర్ 16 (విజయక్రాంతి): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School)లో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, బోధనా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులుగా మారి చక్కగా పాఠాలు బోధించిన విద్యార్థులను ఉపసర్పంచ్, గ్రామ ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులుగా కంపాస్ బాక్సులు, కలర్ పెన్సిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.