ముస్లింల విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ఎంఐఎం కృషి

16-11-2026 | 07:05pm

సాలారే మిల్లత్ గైడ్స్ పంపిణీలో ఎంఐఎం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గులాం అహ్మద్

గంభీరావుపేట, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎంఐఎం పార్టీ విశేషంగా కృషి చేస్తుందని ఎంఐఎం పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్(Syed Ghulam Ahmed Hussain) అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని, గంభీరావుపేట, వేములవాడలో గల ప్రభుత్వ ఉర్దూ మీడియం బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ 2026 గైడ్స్ ను పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ..ఎస్సెస్సీ విద్యార్థులందరూ కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. జీవితంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు కీలకమని, ఈపరీక్షలో ఉత్తీర్ణులు అవ్వడానికి సాలారే మిల్లత్ గైడ్ దోహదపడుతుందని అన్నారు. హైదరాబాద్ మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ భవిష్యత్ తరాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో, గత 26 సంవత్సరాల క్రితం ఆల్ ఇన్ వన్ గైడ్సను, ఎంఐఎం పార్టీ తరఫున ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందజేస్తున్నట్లు చెప్పారు.

సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ తర్వాత, తమ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉర్దూను బ్రతికించడం కోసం ఉర్దూ మీడియం పాఠశాలలో, విద్యా ప్రమాణాలు పెంచడం కోసం, ముస్లింల విద్య అభివృద్ధి కోసం అమోఘమైనటువంటి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఎంఐఎం నాయకులు మహమ్మద్ ముస్తఫా, పర్వేజ్, సమీ, గంభీరావుపేట ఎంఐఎం నాయకులు ఇర్ఫాన్ ఖాన్, షోయబ్, గౌస్, హమీద్, అజీజ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు