ఈ నెల 29న అలుగునూరులో ‘దీక్షా దివాస్’

15-11-2026 | 05:30am
  1. సభకు హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  2. బీఆర్‌ఎస్ నాయకులు

నవంబర్ 14 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(BRS chief KCR) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ నెల 29న దీక్షా దివాస్(Diksha Divas) నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని అలుగునూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు.

శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, టీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడారు. అలుగునూరులో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని, ఆ రోజు 40, 50 ఏళ్ల దరిద్రానికి ముగింపు పలుకుతూ చరిత్ర మలుపు తిరిగిందని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేసీఆరే ప్రధాన కారణమని, తెలంగాణ భూమి ఉన్నంతకాలం ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. ఈ నెల 29న కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తామని, అలుగునూరు సభకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. క్విట్ ఇండియా నినాదం మాదిరిగానే ’కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ నినాదం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అణచివేసిందని, సీమాంధ్ర నాయకులు అనేక రాజకీయ కుట్రలు చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఆ సమయంలో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగడంతో యావత్ తెలంగాణ ఏకతాటిపైకి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పాత్ర కూడా కీలకమని, అయితే ఆమె ఆత్మకథలో తెలంగాణ ఏర్పాటు ప్రస్తావన లేకపోవడంపై తాను ట్వీట్ చేశానన్నారు.

మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రవీందర్ సింగ్, చిరుమళ్ల రాకేష్ కుమార్, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు రవీందర్ రెడ్డి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు