బొమ్మలకు కనుబొమ్మ.. శీలావీ

16-11-2026 | 05:05am

నాలుగు దశాబ్దాల గతాన్ని ఒక్కసారి కదిపితే చిత్తరువు లాంటి చిత్రాలను అలవోకగా అందించి, మనసుపై చెరగని ముద్ర వేసిన ఓ చిత్రకళా మహర్షి కనిపిస్తారు... ఆయనే శీలా వీర్రాజు (శీలావీ). వరద వెంకటరత్నం వంటి పెద్దల వద్ద చిత్రకళను అభ్యసించి.. చదువుకునే రోజుల్లోనే ప్రదర్శనలకు తన చిత్రాలను పంపి ఎన్నో బహుమతులు అందుకున్నారు. శీలావీ రేఖా చిత్రాలకు స్వదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో కూడా కీర్తిప్రతిష్ఠలు లభించాయి. కవిగా, నవలాకారుడిగా, కథారచయితగా, చిత్రకళామూర్తిగా  ఆయన కృషి బహుముఖం.

‘మైనా’, ‘కాంతి పూలు’, ‘వెలుగు రేఖలు’ వంటి నవలలు, ‘కొడిగట్టిన సూర్యుడు’, ‘కిటికీ కన్ను’, ‘ఎర్ర డబ్బా రైలు’ తదితర కవితా సంపుటాలు, ‘సమాధి’, ‘మబ్బు తెరలు’, ‘రంగుటద్దాలు’ వంటి కథా సంపుటాలు, ‘శిల్ప రేఖ’ వంటి లేపాక్షి రేఖాచిత్రాలు, ‘కలానికి ఇటూ అటూ’ వంటి వ్యాస సంపుటాలు శీలా వీర్రాజు ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి.

అంతటి కృషీవలుని సుదీర్ఘ సృజన ప్రయాణానికి దర్పణంగా ‘ఒక చిత్రకారుడు: కొన్ని అవలోకనాలు’ పేరుతో శీలా సుభద్రాదేవి కూర్పుతో పుస్తకం వెలువడింది. ఈ పుస్తకంలోని వ్యాసాలు వీర్రాజు చూపూ, మనసూ, ఆలోచనా ఒకచోట కేం ద్రీకరించి.. ఒక రుషిలా దశాబ్దాల పాటు కొనసాగించిన అవిరళ, అవిశ్రాంత చిత్ర రచనా తపస్సును ఇప్పటి తరం వారికోసం ఆవిష్కరించాయి. ఇప్పుడైతే పుస్తకా ల ముఖచిత్రాల పద్ధతి ఫొటోలు, డిజిటల్ చిత్రాల దిశగా సాగిపోతున్నది.

అంతకుముందు దశాబ్దాల్లో డ్రాయింగ్ బోర్డుపైన పేపర్లలో ముఖచిత్రాల కోసం ఆలోచనాత్మకంగా రేఖలు, చిత్రాలు గీసే పద్ధతి ఉం డేది. అప్పుడు అందరికీ ఆప్త చిత్రకళా బం ధువు ఎవరంటే ముందుగా గుర్తుకువచ్చేది శీలావీ పేరే. ముఖచిత్రం శీలావీ వేస్తే అదొ క ప్రత్యేకమైన పుస్తక ట్రెండ్‌గా స్థిరపడిపోవడమే ఆయనలోని సృజనకు ప్రత్యేకత.

ఒకరకంగా చెప్పాలంటే వేలాది బొమ్మలకు తానొక కనుబొమ్మయ్యారు. అంతటి మహా చిత్రకారుని కృషిని భిన్నకోణాల్లో స్పర్శిస్తూ వెలువడిన ఈ వ్యాసాలను ఆ యనను గురించి ప్రత్యక్షంగా తెలిసిన వారే రాయడం ఎంతో సహజత్వాన్ని పెంచింది.

ఆ చిత్రకారుడి కృషిని చాటే వ్యాసాలు

‘శిలావీ లేపాక్షి శిల్ప రేఖలు’ అన్న తొలి వ్యాసంలో అంట్యాకుల పైడిరాజు.. శీలావీ చేసిన శిల్పకళా ప్రయత్నం ఎంతో శ్రమతో కూడుకొని ఆయన ప్రతిభకు అద్దం పట్టిందని అభిప్రాయపడ్డారు. లేపాక్షిని వెలుగు లోకి తెచ్చిన కల్లూరి సుబ్బారావును కలుసుకున్నాక స్వయంగా శీలావీ రాసిన ‘నేనూ -నా లేపాక్షి స్కెచ్ లూ’ అన్న వ్యాసం చిత్రకళా శిల్పుల కృషి ప్రాధాన్యతతోపాటు, సాంస్కృతిక వైవిధ్యత వంటి అనేక అంశాలను వెల్లడించింది.

1968లో అనంతపురం నుంచి హిందూపురం వరకు ప్రయాణిస్తూ తన మనసులో గీసుకున్న ఒక స్కెచ్ బుక్ కురిపించిన శిల్పాలు, చిత్రాలను గురించి శీలావీ చెబుతూ.. 1970 వరకు వాటికి ఖండాంతరాలలో లభించిన బహుముఖ ఆదరణను వివరించారు. ‘స్వర్గంలోనూ, భూమిపైనా, దేవతల, మానవు ల నృత్యాలు’ అన్న వ్యాసంలో గోటెంజన్  ప్రెస్.. శీలావీ తన ఫ్రీహేండ్ చిత్రాల ద్వారా భారతీయ సంస్కృతికి, చిత్రకళా రంగానికి చేసిన విశిష్ట సేవకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన భారతీయ అకాడమీ బహుమతిని కూడా పొందారని పేర్కొంది.

కన్నడ ప్రజామతలో ‘చూడ చక్కని ఆంధ్ర కళానిధి’ శీర్షి కన హం.వెంకట నాగరాజారావు రాసిన వ్యాసంలో.. శీలావీ లేపాక్షి ప్రతి కృతులు కళావిధునిగా ఆయన చిరఖ్యాతిని నిలబెడతాయన్నారు. కుంచెతో, లేఖిని తో అంతరంగ భావాలను శీలావీ ఆవిష్కరించిన తీరును ప్రస్తావించారు. ‘కథలు చెప్పే చిత్రా లు’ పేరుతో కాండ్రేగుల నాగేశ్వరరావు ముందుమాట రాస్తూ ఆయన స్కెచ్ బుక్ నుంచి బయటపడ్డ రేఖాచిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువేననిపించి ఇంకా ఉంటే బాగుండు అన్న భావన కలుగుతుందన్నారు.

ఎందరో పంచుకున్న భావాలు 

శీలావీ చిత్రకళా ప్రదర్శనల గురించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రొఫెసర్ ఎస్‌వీ రామారావు ఆలోచన ఆత్మకథను పెంపొందించేలా వివరించారు. గొప్ప ఆదరణ దక్కిన చిత్రకళాతపస్విగా శీలావీని రా మారావు ప్రస్తుతించారు. వాడ్రేవు చిన వీరభద్రుడు, వారణాసి నాగలక్ష్మి, కందుకూరి రమేష్‌బాబు, ద్వారం దుర్గాప్రసాద రావు, కళాసాగర్ యల్లపు, ఎల్ ఆర్ వెంకటరమణ, సుంకర చలపతిరావు,

డా. కేయ ల్ వీ ప్రసాద్, అన్వర్, ముక్కామల చక్రధర్, రామవరపు గణేశ్వరరావు, మాధవీ సనారా, మాకినీడి సూర్య భాస్కర్, ఆత్మకూరు రామకృష్ణ వ్యాసాల్లో.. శీలావీ చిత్రసత్కళాభరిత నైపుణ్యాన్ని విశ్లేషించారు. చిత్రకళా శిల్పిగా శీలా వీర్రాజు ఎంతో శ్రమకోర్చి చేసిన దశాబ్దాల కృషి ఇలా ‘ఒక చిత్రకారుడు: కొన్ని అవలోకనాలు’ వ్యాసమాలికగా అక్షర నిక్షిప్తమైంది. శీలావీ సమున్నత ప్రతిభకు ఈ పుస్తకం అద్దం పట్టింది.

 సెల్: 9441464764


మరిన్ని వార్తలు