సమ్మిట్‌కు భారత్ అని పేరు పెట్టి దేశాన్నే బద్నాం చేస్తరా?

16-11-2026 | 05:20am

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం

  1. భారత్ సమ్మిట్‌లో ఇక్కడి వ్యవస్థలపై విదేశీయుల విమర్శలేమిటి? 
  2. అంతర్జాతీయ వేదికల మీద పరువు తీయడమే రాహుల్ పని
  3. అలా చేస్తేనే అధికారం వస్తుందని ఆయన భ్రమిస్తున్నారు
  4. 30 ఏండ్లయినా కాంగ్రెస్‌కు అధికారం కల్ల అని ఎద్దేవా

ముంబై, నవంబర్ 15: హైదరాబాద్‌లో రెండురోజుల పాటు నిర్వహించిన సదస్సుకు ‘భారత్ సమ్మిట్’(Bharat Summit) అని పేరు పెట్టి భారతదేశాన్ని, ఇక్కడి వ్యవస్థలను విమర్శించడం ఏమిటని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మండిపడ్డారు.

అంతర్జాతీయ వేదికలమీద దేశాన్ని బద్నాం చేయడమే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పనిగా పెట్టుకున్నారని, అలా చేస్తే అధికారం వస్తుందని భ్రమిస్తున్నారని, అది కల్ల అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా భారత్‌ను, ప్రధాని మోదీని కీర్తిస్తుంటే ఇక్కడి కొందరు మాత్రం భారత్‌ను, ప్రధాని మోదీని కించపరిచేలా అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. ‘హైదరాబాద్‌లో రెండు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. దానికి భారత్ సమ్మిట్ అని పేరు పెట్టి.. ఇతర దేశాల వామపక్ష నేతలను పిలిపించుకున్నారు. ఈ దేశాన్ని, ఈ దేశ ప్రధానిని విమర్శించడమే అందులో పనిగా పెట్టుకున్నారు.

ఇతర దేశాల ప్రతినిధుల ముందు దేశాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూశారు. ఆ ప్రతినిధులతో కూడా ఇష్టారీతిగా మన దేశ వ్యవస్థలపై మాట్లాడించారు. కాంగ్రెస్ యువరాజు (రాహుల్‌గాంధీ)కు ఇలా అంతర్జాతీయ వేదికలతోపాటు విదేశాల్లో తిరుగుతూ మన దేశాన్ని బద్నాం చేయడం అలవాటుగా మారింది. అలా విమర్శిస్తే అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. అది కల్ల’ అని హెచ్చరించారు. 

30 ఏండ్లయినా వాళ్లకు అధికారం కల్ల

అంతర్జాతీయ వేదికల చుట్టూ, విదేశాల చుట్టూ రాహుల్ గాంధీ తిరిగితే ఫాయిదా ఉండదని.. మారుమూల గ్రామాల్లోని ప్రజల దగ్గరికి వెళ్తేనే అంతో ఇంతో ఫాయిదా ఉంటుందని అమిత్ షా అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. ఆ పార్టీకి కీలక నేతగా రాహుల్ గాంధీ ఎదుగుతున్న కొద్దీ.. పార్టీ ఓడిపోతూనే ఉంది.

12 ఏండ్లలో మూడుసార్లు ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఓటమిని చవి చూసింది. లోపం ఎక్కడుందో ఆ పార్టీ ఆలోచిస్తే బెటర్. వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నిరాశలో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారో వాళ్లకే అంతుపట్టడం లేదు. ఇలానే వాళ్లు వ్యవహరిస్తే 30 ఏండ్లయినా ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు’ అని ఆయన తేల్చిచెప్పారు.

కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని, మోదీ ప్రభుత్వంపై 12 ఏండ్లలో ఒక్కపైసా కూడా అవినీతి ఆరోపణ లేదన్నారు. ఎలాంటి అంశాలపైనైనా పార్లమెంట్‌లో చర్చించేందుకు తాము సిద్ధమని, దేశ ప్రతిష్టను ఇతర దేశాల ప్రతినిధుల ముందు దెబ్బతీయడం సరికాదని అమిత్ షా పేర్కొన్నారు. 

ఇటలీ నేత పరువు తీస్తుంటే నవ్వుతారా?: కిరణ్ రిజిజు

భారత్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో ఓ సదస్సు నిర్వహిస్తే, అందులో ఇటలీ నేత జియాకోమ్ ఫిలిబెక్ భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం ఏమిటని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ‘ఓ విదేశీయుడు ప్రధాని మోదీకి, ఈ దేశ వ్యవస్థలకు వ్యతిరేకంగా మాట్లాడితే.. అవమానిస్తుంటే..

అక్కడే ఉన్న రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు నవ్వడమేమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. ‘కశ్మీర్ లాంటి అంశాల్లో వ్యతిరేకించిన విదేశీయులు, నెట్‌వర్క్, సంస్థలకు సంబంధించిన వ్యక్తులకు హైదరాబాద్‌లో ఎందుకు వేదిక కల్పించారు?’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు