విద్యార్థుల పోరాటం ఫలించింది

16-11-2026 | 05:10am
  1. పాలిటెక్నిక్ విద్యలో జీవో 97పై వెనక్కి తగ్గిన సర్కార్
  2. సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
  3. విద్యార్థులు, అధ్యాపకులపై కేసులు ఎత్తివేయాలి
  4. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థుల(Polytechnic students) సుదీర్ఘ పోరాటం చివరకు ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(BRS MLC Dasoju Sravan) ఆదివారం ప్రకటనలో తెలిపారు. జీవో 97 విషయంలో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 157 వెనక్కి తగ్గిన నిర్ణయమని, మొదటి నుంచి విద్యార్థులు చేస్తున్న ఆందోళన న్యాయమైనదని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించి నట్లయిం దని పేర్కొన్నారు.

ఇది ప్రభుత్వ దయ కాదని, విద్యార్థుల పోరాట విజయమని స్పష్టం చేశారు. జీవో 97ను వ్యతిరేకించిన విద్యార్థులపై జరిగిన పోలీసు దాష్టీకాలకు సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని, విద్యార్థులు, అధ్యాపకులు, మద్దతుదారులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 97 రూపకల్పనలో సీఎం కార్యాలయం పాత్ర ఉందని, విద్యారంగ నిపుణులు, ఏఐసీటీఈ, ఎస్బీటీఈటీ, అధ్యాపకులు, విద్యార్థులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

విద్యాశాఖను సీఎం తన వద్దే ఉంచుకున్నందున ఈ నిర్ణయానికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో 157లో పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించలేదని ఆరోపించారు. ఎస్బీటీఈటీ, టీజీ ఈసెట్ లేటరల్ ఎంట్రీ, ఫీజులు, స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్, పాలిటెక్నిక్ కళాశాలల భూములు, ఆస్తుల పరిరక్షణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం మౌనం వహించిందని విమర్శించారు.

సంబంధిత అనుమతులు పొందిన తర్వాతే కోర్సుల విస్తరణ చేపట్టాలని జీవో 157లో పేర్కొనడం, గతంలో తీసుకున్న నిర్ణయాల్లోని తొందరపాటును బయటపెడుతోందని తెలిపారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రతిపాదనల విషయంలోనూ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించిందని విమర్శించారు.

2024లో సుమారు రూ.826 కోట్లతో ప్రతిపాదించిన ప్రాజెక్టు అంచనా రూ.1,090 కోట్లకు పెరిగిందని, ప్రజలు, పర్యావరణవేత్తల అభ్యంతరాలను పట్టించుకోకుండా చెట్ల నరికివేత, తవ్వకాలు చేపట్టిన తర్వాత అక్టోబర్ 3, 4 తేదీల్లో ప్రాజెక్టును రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఖర్చు చేసిన ప్రజాధనంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే తరహాలో ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలకు సిద్ధమవుతోందని ఆరోపించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేసి 11, 12 తరగతులను పాఠశాలల్లో విలీనం చేయాలని నవంబర్ 11న సీఎం అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీనిపై చట్టసభల్లో చర్చ, విద్యారంగ నిపుణులతో సంప్రదింపులు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంపై అవగాహన, ప్రజాస్వామ్య విలువలు ఉన్న పూర్తికాల విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు