19న సిద్దిపేటకు సీఎం
- ఇందిరమ్మ బీమాకు రేవంత్ రెడ్డి శ్రీకారం
- హరీశ్ రావు పతనానికి కౌంట్ డౌన్
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సిద్దిపేటకు వస్తున్నారని, ఆ సభలో హరీశ్ రావు మరిన్ని భాగోతాలు బయటకు రాబోతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) తెలిపారు. ఆదివారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ బీమా కార్యక్రమాన్ని సిద్దిపేట వేదిక నుంచి ప్రారంభించబోతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా కల్పించబోతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తుండడంతో హరీశ్ రావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘సిరిసిల్లకు వస్తానని చెప్పాం.. వచ్చి చూపించాం’ అని భాగోతాలు బయటపెట్టి, ఓటమి భయం కేటీఆర్‌కు చూపించామన్నారు. ఇక హరీశ్ రావు వంతు అని పేర్కొన్నారు.
మామను అడ్డు పెట్టుకుని హరీశ్ రావు సిద్దిపేటలో పాగా వేశారని, కుమ్మక్కు రాజకీయాల్లో హరీశ్ రావు దిట్ట అని, ఇతర పార్టీల నాయకులను ప్రలోభపెట్టి సిద్దిపేటలో గెలుస్తూ వస్తున్నారని విమర్శించారు. సిద్ధిపేటపై సీఎం దృష్టి పెట్టారని ఇక హరీశ్ రావు ఆటలు సాగవని కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు.
ఫామ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, రంగనాయక సాగర్ భూముల వ్యవహారాలు, మిల్చి మిల్క్ మిల్క్ డెయిరీ వంటి వాటిని బయటపెట్టామన్నారు. ఇక హరీశ్ రావు నిజస్వరూపాన్ని సిద్దిపేట ప్రజలకు చూపించే సమయం ఆసన్నమైందన్నారు. బీఆర్‌ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడానికి మూలకారణం హరీశ్ రావు, సంతోష్ రావు అని మొదటి నుంచి కవిత చెబుతోందన్నారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు ఎలా అక్రమంగా నీళ్లు తీసుకుపోతున్నాడో కవితే స్వయంగా చెబుతోందన్నారు.
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను చూస్తే జాలేస్తుందని, బీఆర్‌ఎస్ పార్టీలో బలికా బకరా ఆయనే అన్న విషయం ఆయనకు తెలియడం లేదన్నారు. కవితకు రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రగతిభవన్‌లో, ఫామ్ హౌస్‌లో పదేళ్లలో మీరు వేసిన వేషాలకు ప్రత్యక్ష సాక్షి కవిత అన్నారు. హరీశ్ రావుకు దమ్ము, ధైర్యం ఉంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత కూడా ఒట్టి ఆరోపణలు చేయకుండా దర్యాప్తు సంస్థల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.