నక్సల్స్ రహిత దేశంగా భారత్
- హింస వల్ల నష్టపోయింది ఆదివాసీలు, గిరిజనులే
- ఈ సమస్యను గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలే
- గడ్చిరోలిలో 3వేల కోట్ల ప్రాజెక్టు పనుల ప్రారంభం
- 150వ బిర్సాముండా జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, నవంబర్ 15: నక్సలైట్ల హింస(Naxalite violence) వల్ల అత్యధికంగా నష్టపోయింది ఆదివాసీలు, గిరిజనులేనని దీనిపై గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2014లో దేశవ్యాప్తంగా 125 జిల్లాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని, తమ ప్రభుత్వం 12 ఏళ్లలో ఈ సమస్యను, హింసను పూర్తిగా అరికట్టి ఆదివాసీ,
గిరిజనుల అభివృద్ధికై అడుగులు వేస్తుందన్న విషయం తమ కార్యక్రమాల ద్వారా స్పష్టమవుతుందన్నారు. దీంతో ఆదివాసీ, గిరిజన వర్గాల్లో తమ ప్రభుత్వం పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ను నక్సల్స్ రహితంగా మార్చామన్నారు. తమ పాలనలో దేశంలో 50 శాతం మంది అత్యంత దారిద్య్రరేఖ నుంచి విముక్తి పొందారని, ప్రపంచ బ్యాంకు నివేదిక ద్వారా స్పష్టం అవుతుందన్నారు.
నక్సలిజం, ఉగ్రవాదం నుంచి దేశం విముక్తి పొందడం దేశానికి విజయ సంకేతాలను, అభివృద్ధికి ఈ ప్రభుత్వం రాచమార్గాలు వేస్తుందని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం హింస ఏ రూపంలో ఉన్నా దాన్ని సహించబోదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. తొలుత రూ. 3వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరెంటు లేని 18వేల గ్రామాలకు విద్యుత్‌ను అందించామని, వంద జిల్లాల్లో ఆదివాసీ, గిరిజనులకు పూర్తిగా ఉచిత రేషన్ అందజేస్తున్నామని, రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం, విద్య, మౌలిక సదుపాయాలు కల్పించామని ప్రధాని పలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం లక్ష కోట్లకు పైగా నిధులను కేటాయించామని చెప్పారు.
స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనులు, ఆదివాసీల పాత్ర కూడా కీలకంగా ఉందని పలు ఉదాహరణలను వివరించారు. భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఢిల్లీ పార్లమెంట్ ఆవరణ ప్రేరణ స్థల్‌లోని ఆయన విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గిరిజన కళాకారుల నృత్యప్రదర్శనను తిలకించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.