30న హైదరాబాద్‌లో ఆటో బంద్

16-11-2026 | 05:05am
  1. మా 15 డిమాండ్లను పరిష్కరించాలి
  2. ఎమ్‌టీఏడీ జేఏసీ కన్వీనర్ అమానుల్లా ఖాన్

ముషీరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఆటోమీటర్ ఛార్జీల(Autometer charges) పెంపుతో సహా ఆటో డ్రైవర్ల 15 న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న నగరవ్యాప్తంగా ఒకరోజు ఆటో బంద్ నిర్వహించనున్నట్లు మహాత్మాగాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ ప్రకటించారు.

డిమాండ్లను పరిష్కరించకపోతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరగూడలోని ఎన్‌ఎస్‌ఎస్ న్యూస్ సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో మంత్రి 15 రోజుల్లోనే ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి సమ్మెను విరమింపజేశారని,

మూడు నెలలు గడిచినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని విమర్శించారు. గ్రీన్ క్యాబ్‌లను నిషేధించాలని, ఆటో కనీస మీటర్ ఛార్జీని రూ.25కు పెంచాలని, కిలోమీటరుకు రూ.50 చొప్పున ఛార్జీ నిర్ణయించాలని కోరారు. ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని, మూడేళ్ల బకాయి రూ.36 వేలు చెల్లించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రయాణ సేవల అనువర్తనం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర జిల్లాల ఆటోల అక్రమ రాకపోకలను నియంత్రించాలని కోరారు. విధి నిర్వహణలో హత్యకు గురైన ఆటోడ్రైవర్ మహ్మద్ ముకరం కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం, డబుల్ బెడ్‌రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

డిమాండ్లు పరిష్కరించకపోతే నవంబర్ 30న ఆటో బంద్‌తో పాటు అవసరమైతే చక్కాజామ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆటోడ్రైవర్లందరూ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ జాయింట్ కన్వీనర్లు డైమండ్ సలీం, ముస్తాక్ సిద్ధిఖీ, సలహాదారు మారుతీరావు జగ్‌తాప్ తదితరులు పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు