ఆశ్చర్యపరిచే థ్రిల్లర్ ది మేజ్

16-11-2026 | 05:10am

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్(Hero Sriram) నటిస్తున్న కొత్త సినిమా ‘ది మేజ్’(The movie ‘The Maze’). ఈ చిత్రాన్ని సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్లపై డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయి, డాక్టర్ కరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు.

ఇందులో ప్రియాంక, హృతిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. “పాతికేళ్లకు నాకోసం టైటిల్ కార్డ్‌లో ఒక థీమ్ మ్యూజిక్‌ను మా డైరెక్టర్ క్రియేట్ చేశారు.

ఆర్టిస్ట్‌కు తనకు దక్కే గుర్తింపులో ఎంతో సంతృప్తి లభిస్తుంది. ఇటీవల కాలంలో నేను చేసిన క్వాలిటీ ఫిలిం ‘ది మేజ్’. ఈ మూవీ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది” అన్నారు. హీరోయిన్ హృతిక మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో ఈషా అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నా. నా కెరీర్‌లో చేసిన గొప్ప పాత్ర ఇదేనని నమ్ముతా. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తప్పకుండా వైరల్ అవుతుంది” అని చెప్పింది.

‘ఈ సినిమా కథలో జరిగే మలుపులు ప్రేక్షకులు ఊహించలేరు’ అని హీరోయిన్ ప్రియాంక తెలిపింది. డైరెక్టర్ డా.రవికిరణ్ మాట్లాడుతూ.. “ది మేజ్’ అంటే ‘పద్మవ్యూహం’ అని అర్థం. ఆ పరిస్థితుల్లో చిక్కుకుని ఆ తర్వాత ఎలా బయటపడతాడు అనేదే ఈ సినిమా నేపథ్యం” అన్నారు.

నిర్మాత డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయి మాట్లాడుతూ.. “ఈ సినిమా కథ చెప్పినప్పటి కంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చూపు తిప్పుకోలేకపోయా. సెకండాఫ్ ఇంకా గ్రిప్పింగ్‌గా ఉంటుంది” అని తెలిపారు. డీవోపీ శివకృష్ణ, నటీనటులు శ్రీష, రవివర్మ, కమల్ కామరాజుతో పాటు అతిథులు కూడా ఈ వేడుకలో మాట్లాడారు. 


మరిన్ని వార్తలు