ప్రేమ పేరుతో నమ్మించి.. ఉగ్ర కార్యకలాపాల్లోకి దింపి..!

16-11-2026 | 05:10am
  1. రాజస్తాన్ రైల్వే ట్రాక్ పేలుడు కేసులో మహిళ అరెస్టు
  2. ఆమెకు పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడి

జైపూర్, నవంబర్ 15: ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన రైల్వే ట్రాక్ పేలుడు(Railway track explosion) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు కారణమైన ఓ యువతిని యాంటీ టెర్రరిజం స్కాడ్ (ఏటీసీ) అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆమెకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. పాక్ హ్యాండ్లర్లు ఇక్కడి ఒంటరి మహిళలను  ప్రేమపేరుతో నమ్మించి.. ఉగ్ర కార్యకలాపాలకు పావులుగా వాడుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

అసలేం జరిగింది? 

రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలోని భారత్  పాక్  సరిహద్దులోని రైల్వే ట్రాక్‌పై ఈ నెల 3న రాత్రి 9.45 గంటలకు పేలుడు జరిగింది. ఈ ధాటికి ట్రాక్ కొంత మేర దెబ్బతినగా.. రెండున్నర అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. ఆ సమయంలో అటుగా రైళ్ల రాకపోకలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. దీనిపై విచారణ చేపట్టిన రాజస్థాన్ ఏటీసీ అధికారులు..

సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా  పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన 21ఏండ్ల మహక్‌దీప్ కౌర్‌ను అరెస్టు చేశారు. ఆమెతోపాటు దేవేంద్రసింగ్ అనే యువకుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

ప్రేమ పేరుతో నమ్మించి..!

మహక్‌దీప్ కౌర్ భర్త కొన్నాళ్ల క్రితం మాదకద్రవ్యాల కేసులో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆమెతో పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లు పరిచయం ఏర్పర్చుకున్నారు. ప్రేమ పేరుతో ఆ మహిళను నమ్మించి, డబ్బులు ఆశ చూపి ఉగ్ర కార్యకలాపాల్లోకి దింపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్ పేలుడుకు మహక్‌దీప్ కౌర్ కుట్ర చేసినట్లు భావిస్తున్నారు. ఆమెకు దేవేంద్రసింగ్ అనే స్థానిక యువకుడు సహకరించాడు. మహక్‌దీప్ కౌర్‌కు పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. షా, చాచా అనే కోడ్ పేర్లతో వారిని గుర్తించాయి. వీరిని పాకిస్తాన్ ఐఏఎస్‌ఐ ఏజెంట్లుగా రాజస్తాన్ పోలీసులు అనుమానిస్తున్నారు.

గతంలో రాజస్తాన్‌లోని గంగాపూర్ సిటీలో కూడా బబిత అనే మహిళను కూడా పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లు ఇలానే ప్రేమ పేరుతో వలలోకి దింపి.. ఉగ్ర కుట్రకు పాల్పడ్డారు. తాజా కేసుకు, అప్పటి కేసుకు దగ్గరి పోలికలు ఉండటంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా, మహక్‌దీప్ కౌర్ దగ్గర రెండు ఆయుధాలు, 46 తూటాలు, రూ. 30వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పేలుడు కార్యకలాపాల కోసమే ఈ నగదును మహక్‌దీప్‌కు పాక్ హ్యాండ్లర్లు ఇచ్చి ఉంటారని  భావిస్తున్నారు. ఒంటరి మహిళలకు మాయమాటలు చెప్పి.. ఉగ్ర కార్యకలాపాల్లోకి దింపుతున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు