ప్రజావాణిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని వినతి
బెజ్జూర్ నవంబర్ 16 (విజయక్రాంతి): బెజ్జూర్(Bejjur) మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వాసులు మండల నోడల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో క్రీడా ప్రాంగణం, మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలో యువతకు ఆటలు ఆడేందుకు సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రోడ్లపై, ఖాళీ స్థలాల్లో ఆటలు ఆడాల్సి వస్తుందని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తే యువతకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుందని, ఆరోగ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి, క్రీడా ప్రాంగణం, మినీ స్టేడియం ఏర్పాటుకు త్వరగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.