ప్రభుత్వ భూములను కాపాడాలని వినతి
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల(Mancherial) జిల్లా కేంద్రంలో ఉన్న సర్వే నంబర్ 87లోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని, ప్రజా అవసరాలకు, ప్రభుత్వ ఆదాయాభివృద్ధికి ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ జిల్లా కలెక్టర్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వానికి చెందిన విలువైన భూములు ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాల్సి ఉండగా, వాటి పరిరక్షణపై తగిన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. సర్వే నంబర్ 87లో ఉన్న ప్రభుత్వ భూమి విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి కోరారు.
ఈ భూమికి సంబంధించిన వివాదాలు కోర్టులో ఉండగా, పరిష్కారం కాకముందే కొందరు వ్యక్తులు ఈ భూమిని అన్యాక్రాంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, బ్లూ షీట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వానికి చెందిన భూములను కొంతమంది వ్యక్తుల స్వప్రయోజనాల కోసం కాకుండా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం మాత్రమే కాకుండా, వాటిని ప్రజలకు మేలు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చన్నారు.
అన్ని పార్టీలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రభుత్వ భూమిని కాపాడి, అంబేద్కర్ స్టడీ సెంటర్‌తో పాటు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
జిల్లా కలెక్టర్ ఈ విషయంపై తక్షణమే స్పందించి, సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరిపించి, సర్వే నంబర్ 87లోని ప్రభుత్వ భూమిని పరిరక్షించి ప్రజా ప్రయోజనాలకు వినియోగించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీఎస్పీ EC మెంబర్ MD మాతిన్ ఖాన్, మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ పెట్టం చంద్రశేఖర్, అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జి దుర్గం గంగారాం, అధ్యక్షులు గాజుల శంకర్, మందమర్రి మండలం అధ్యక్షులు Md రహీం బాబా, నాయకులు చింతల సంతోష్, తదితరులున్నారు.