బినామీ బిల్లుల దందా..!

16-11-2026 | 08:37pm
  1. -గ్రామసభ తీర్మానాలు లేకుండానే పనులు చేసినట్లు రికార్డులు.?
  2. -కాగితాలపైనే పనులు.. నిధులు స్వాహా.?
  3. -బినామీ పేర్లతో బిల్లుల చెల్లింపులపై ఆరోపణలు
  4. -ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజల డిమాండ్

వెంకటాపూర్, నవంబర్ 16 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu district) వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనుల పేరుతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్రామసభ తీర్మానాలు లేకుండానే పనులు చేపట్టినట్లు చూపించడం, బినామీ వ్యక్తుల పేర్లతో బిల్లులు సృష్టించడం, పనులు చేయకుండానే ప్రభుత్వ నిధులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు మండలంలో కలకలం రేపుతున్నాయి. పంచాయతీల్లో జరుగుతున్న నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

తీర్మానాలు లేకుండానే పనులు..

పంచాయతీల్లో ఏదైనా అభివృద్ధి పని చేపట్టాలంటే ముందుగా గ్రామసభలో తీర్మానం చేయడంతో పాటు నిబంధనల ప్రకారం అనుమతులు పొందాలి. పనులకు అంచనాలు రూపొందించి, సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పనులు పూర్తి చేసిన అనంతరం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మండలంలోని కొన్ని గ్రామపంచాయతీల్లో ఈ నిబంధనలను పక్కనపెట్టి పనులు చేపట్టినట్లు రికార్డులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగితాలపైనే అభివృద్ధి పనులు.?

క్షేత్రస్థాయిలో పనులు జరగకపోయినా రికార్డుల్లో మాత్రం పూర్తయినట్లు చూపించి బిల్లులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్న పనులను సైతం పూర్తయినట్లు నమోదు చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, పంచాయతీ భవనాల మరమ్మతులు తదితర పనుల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బినామీల పేర్లతో బిల్లులు.?

పంచాయతీ పనులు చేసిన అసలు వ్యక్తుల పేర్లకు బదులుగా ఇతరుల పేర్లతో బిల్లులు రూపొందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పని చేయని వ్యక్తుల పేర్లతో బిల్లులు పెట్టడం, ఒకే పనికి రెండుసార్లు బిల్లులు సమర్పించడం వంటి వ్యవహారాలపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి..

అన్ని గ్రామపంచాయతీల్లో గత రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామసభ తీర్మానాలు, పనుల అంచనాలు, ఎంబీ రికార్డులు, బిల్లులు, నిధుల చెల్లింపులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు