రేషన్ బియ్యం పంపిణీలో కోత.. పేదల కడుపు కొట్టడమేనా?

16-11-2026 | 05:20am
  1. 35 కిలోలు అందాల్సిన చోట 6 కిలోలే పంపిణీ.. 
  2. లబ్ధిదారుల ఆవేదన అధికారుల పర్యవేక్షణ కరువు
  3. పంపిణీ విధానంపై ప్రజల్లో అయోమయం 
  4. మండల వ్యాప్తంగా తనిఖీ చేయాలంటున్న జనం
  5. సాయంత్రం లోపు పూర్తి సమాచారం అందిస్తాం : ఆదిత్య, ఎన్ఫోర్స్మెంట్ డీటీ, గండిట్ మండలం 

గండీడ్, నవంబర్ 15 : అసలే కరువు కాలం.. ఎవరు దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. ప్రభుత్వం(Government) నిరుపేదలకు సరిపడ బియ్యం అందించాలని సంకల్పంతో అంత్యోదయ కార్డుల(Antyodaya Cards) ద్వారా కొంతమందికి 35 కిలోల బియ్యం అందిస్తుంది. ఆ బియ్యం లో కూడా చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వం 6 కిలోలు అందిస్తుంది.

అంటూ వారికి తప్పుడు సమాచారం అందిస్తూ ఏండ్ల తరబడి తమకు రావలసిన బియ్యం తక్కువగా ఇస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘటన మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం లో 420 రేషన్ కార్డులు ఉండగా అందులో 85 అంత్యోదయ కార్డులు ఉన్నాయి.

అందులో 30 కార్డుల వివరాలను సేకరించగా చాలా వరకు అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు 35 కిలోలు వేయాల్సి ఉండగా 6 కిలోలు మాత్రమే వేస్తున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుం డ్రు. పేద ప్రజలకు ఆసరాగా నిలవాల్సిన ప్రజాపంపిణీ వ్యవస్థలో గందరగోళం నెలకొంటోంది.

రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందించే బియ్యం పంపిణీలో కోతలు విధిస్తున్నారంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంత్యోదయ రేషన్ కార్డుదారులకు 35 కిలోల బియ్యం అందాల్సి ఉండగా, కేవలం 6 కిలోలే పంపిణీ చేస్తున్నారని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. దీంతో తమ కుటుంబాలకు సరిపడా బియ్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.

ప్రతి గ్రామంలో విచారణ చేయాల్సిందే....

అంత్యోదయ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల మీద బియ్యం సరఫరా జరుగుతుందా లేదా పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని లబ్ధిదారులు కోరుతున్నారు. రేషన్ షాపుల నిర్వహణ ఇలా చేస్తూ బియ్యం రీసైక్లింగ్ కొంతమంది డీలర్లే కారణం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం పేదలకు ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో రేషన్ బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పంపిణీ జరుగుతున్న తీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలు 35 కిలోలు అందాల్సిన కార్డుదారులకు 6 కిలోలే ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఏమిటి? బియ్యం కోటాలో మార్పులు జరిగాయా? లేక పంపిణీలో ఏదైనా సాంకేతిక సమస్య ఉందా? అనే విషయాలపై లబ్ధిదారులకు స్పష్టత లేకుండా పోయింది. రేషన్ దుకాణాలకు వెళ్లిన కార్డుదారులు తక్కువ మొత్తంలో బియ్యం అందడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.

పర్యవేక్షణ ఏదీ.. పట్టించుకునే వారేరీ?

రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను డీలర్లకు, లబ్ధిదారులకు స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ ఆ దిశగా సరైన అవగాహన కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

రేషన్ దుకాణాల్లో ఎంత బియ్యం నిల్వ ఉంది? ఎంత పంపిణీ చేస్తున్నారు? లబ్ధిదారులకు ఎంత మేరకు అందుతోంది? అనే అంశాలపై అధికారులు తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించే వారు లేకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంటోంది.

పేదలకు న్యాయం జరిగేదెప్పుడు?

రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే పేద కుటుంబాలకు రేషన్ బియ్యం ఎంతో కీలకం. బయట మార్కెట్లో బియ్యం కొనుగోలు చేసే స్థోమత లేని కుటుంబాలు ప్రభుత్వ రేష్పనే ఆధారపడుతున్నాయి. అలాంటి వారికి అర్హత మేరకు బియ్యం అందకపోతే కుటుంబ పోషణ మరింత భారంగా మారుతుంది. ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బియ్యం పంపిణీలో కోతలకు గల కారణాలను అధికారులు బహిర్గతం చేయాలని, లబ్ధిదారులకు సరైన సమాచారం అందించాలని ప్రజలు కోరుతున్నారు.జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని, పంపిణీ రికార్డులను పరిశీలించాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

35 కిలోలకు బదులుగా 6 కిలోలే అందుతున్న పరిస్థితిపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం పంపిణీలోనే ఇలాంటి గందరగోళం నెలకొంటే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారి ఆదిత్య గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా? అన్నది వేచి చూడాలి.

సాయంత్రంలోపు సమాచారం ఇస్తాను..

 పూర్తిస్థాయిలో విచారణ చేయడం జరిగింది. సోమవారం సాయంత్రం లోపు పూర్తి విచారణ కు సంబంధించి సమాచారం అందిస్తా. లబ్ధిదారుల నుంచి ఇప్పటికే వివరాలు సేకరించడం జరిగింది.

 ఆదిత్య, ఎన్ఫోర్స్మెంట్ డిడి, గండి మండలం,

కొన్ని యేండ్ల నుంచి ఇవ్వడం లేదు..

 కొన్నేళ్ల నుంచి అంతే దయ కార్డుల ద్వారా లబ్ధిదారులకు గ్రామంలో రేషన్ బియ్యం అందడం లేదు. చాలా మందికి కేవలం 6 కిలోలు మాత్రమే వారికి ఇస్తున్నారు. పేదలకు న్యాయం చేయాలన్నదే మా సంకల్పం. ఈ విషయంపై పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు న్యాయం చేయాలి.

పట్లోళ్ల అనసూయ, సర్పంచ్,జంగంరెడ్డిపల్లి, గండీడ్ మండలం


మరిన్ని వార్తలు