టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిగా డిఎస్. నాగేశ్వరరావు ఐదవ సారి ఏకగ్రీవ ఎన్నిక

16-11-2026 | 08:16pm

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం... 

ఉపాధ్యాయులకు అండగా ఉంటా:డిఎస్. నాగేశ్వరరావు

ఏన్కూర్ నవంబర్ 16 (విజయక్రాంతి): ముదిగొండ మండల కేంద్రంలో ఈనెల 15,16 తేదీలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF)ఖమ్మం జిల్లా ఏడవ జిల్లా మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల టీఎస్ యుటిఎఫ్ ఏన్కూరు మండల కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సంఘ ఎన్నికల్లో వరుసగా ఐదవ సారి జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావటం ఆయన నిబద్ధతకు,అంకిత భావానికి నిదర్శనమని పేర్కొంది.

గతంలో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి,నిరంతర ఉద్యమాలు, ఉపాధ్యాయులకు అందించిన సర్వీసు అభినందనీయమని ఏన్కూరు మండల కమిటీ,ఉపాధ్యాయులు ప్రశంసించారు.ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐదవసారి జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం తనకు ఎంతో సంతోషంతో పాటు, మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.

రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యారంగంపై ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ విద్యారంగ పరిరక్షణకు ఉపాధ్యాయుల హక్కుల సాధనకు మరింత బలంగా పోరాడుతానని తెలిపారు. పెండింగ్లో ఉన్న డిఏలు,రెండవ పిఆర్సి సాధన కోసం ఉద్యమాలను ఉదృతం చేయడంతో పాటు సిఆర్టిలు,కేజీబీవీలు, గురుకులాలు, యుఆర్ఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణతో కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, గిరిజన సంక్షేమ శాఖలో పండిట్స్, పిఈటి పోస్టుల అప్గ్రేడేషన్ ద్వారా పదోన్నతుల కల్పన, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు అవసరమైన ఉపాధ్యాయ పోస్టుల మంజూరు వంటి కీలక అంశాల సాధన కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు.ఉపాధ్యాయులు ఎవరు ఒంటరి వారు కాదని,సంఘం అండగా ఉంటుందని, ప్రతి ఉపాధ్యాయుల సమస్య నా సమస్యగానే భావిస్తానని, సమస్య ఏదైనా అది న్యాయమైనదైతే పరిష్కారం కోసం నా గొంతు వినిపిస్తానని, సంఘం చేపట్టే ప్రతి ఉద్యమంలో ముందుండి పని చేస్తానని, ఉపాధ్యాయులకు అండగా ఉంటూ,వారి హక్కుల సాధన కోసం నా వంతు కృషి చేయటమే నా ప్రధాన లక్ష్యమని, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పదవిని బాధ్యతగా భావించి పనిచేస్తానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏన్కూరు మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బి.రామ్ చంద్, మూడ్.పుల్లయ్య ఉపాధ్యక్షులు శంకరరావు, శ్రీదేవి, కోశాధికారి నరసింహారావు మండల కమిటీ తరఫున జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే మూల పోచారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు, ఉపాధ్యాయ సిబ్బంది బి.శోభన్ బి.సింగ్య బి.సక్రాం బి. రవి,పి.రమేష్, బి.వసంత దేవి,వెంకటరమణ, చందర్రావు, డి.ఉషశ్రీ, నాలుగో తరగతి ఉద్యోగులు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు