రెవెన్యూ కార్యాలయంలో విలువైన భూ రికార్డులు మాయం!

16-11-2026 | 05:20am
  1. కార్యాలయం చుట్టూ చిందర వందరగా దర్శనమిస్తున్న కీలకపత్రాలు!
  2. అధికారుల నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

కోటపల్లి, నవంబర్ 15 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో(Kotapalli Revenue Office ) భద్రంగా ఉండాల్సిన అత్యంత విలువైన భూరికార్డులు కార్యాలయం చుట్టుపక్కల దర్శనమివ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల భూములకు సంబంధించిన కీలక పత్రాలను భద్రపరచాల్సిన రెవెన్యూ అధికారులు చిత్తుకాగితాల్ల పడేస్తున్నారు.

ఇది కార్యాలయం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందనే విమర్శలు పెద్ద మొత్తంలో వినిపిస్తున్నాయి. రైతుల భూములకు సంబంధించిన పట్టాలు, వాటి మార్పిడి పత్రాలు, ఇతర కీలక రికార్డుల నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

పట్టాల మార్పిడిలో అక్రమాల ఆరోపణలు..?

కోటపల్లి మండలంలో భూముల పట్టాల జారీ, పట్టాల మార్పిడి వ్యవహారాలపై గత కొంతకాలంగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు, సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆర్థిక ప్రయోజనాల కోసం పట్టాల మార్పిడి చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చకు వస్తున్నాయి.

గతంలో సిర్స గ్రామానికి చెందిన ఓ రైతుకు తెలియకుండానే పట్టా మార్పిడి జరిగినట్లు వచ్చిన ఆరోపణలు అప్పట్లో కలకలం రేపాయి. రైతుకు తెలియకుండా భూమికి సంబంధించిన రికార్డుల్లో మార్పులు జరిగితే బాధ్యత ఎవరిది..? ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల పాత్ర ఏమిటి..? అన్న ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి.

కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలు బయటకు ఎలా..? 

రెవెన్యూ కార్యాలయంలో భద్రపరచాల్సిన విలువైన భూ రికార్డులు కార్యాలయం చుట్టూ కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రైతుల భవిష్యత్తును నిర్ణయించే భూ పత్రాలకే రక్షణ లేకపోతే సామాన్య రైతుకు న్యాయం ఎలా జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముఖ్యంగా సిర్స గ్రామానికి చెందిన రైతు పట్టాకు సంబంధించిన కీలక పత్రాలు కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆ పత్రాలు ఎక్కడికి వెళ్లాయి..? ఎవరి చేతుల్లోకి చేరాయి..? కావాలనే రికార్డులను పక్కకు తప్పించారా..? లేక అధికారుల పర్యవేక్షణ లోపంతో గల్లంతయ్యాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రికార్డుల మాయలో ఆంతర్యమేమిటి?

భూములకు సంబంధించిన కీలక పత్రాలను భద్రపరచాల్సిన రికార్డు విభాగంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పలు అనుమానాలకు దారితీస్తోంది. రికార్డుల నిర్వహణలో బాధ్యతగా వహించాల్సిన సిబ్బంది పనితీరుపై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు. విలువైన పత్రాలు మాయమవుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదు?

రికార్డుల గల్లంతుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? తప్పిపోయిన పత్రాల స్థానంలో కొత్త పత్రాలు సృష్టించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా..? అనే అనుమానాలు, ప్రశ్నలు మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. చిత్తు కాగితాలుగా కనిపిస్తున్నవి రైతుల భూములకు సంబంధించిన రికార్డులు, ఆస్తి హక్కులకు సంబంధించిన అత్యంత విలువైన ఆధారాలు.

అలాంటి పత్రాలకే భద్రత లేకుండా బయట కనిపిస్తుంటే రెవెన్యూ వ్యవస్థ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం ఎలా నిలుస్తుంది? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి కోటపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలోని భూ రికార్డులన్నింటినీ సమగ్రంగా తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ విషయమై మండల తహసీల్దార్ రాఘవేందర్రావును ’విజయక్రాంతి ’ సంప్రదించగా విలువైన పత్రాలు భయటకు రావని, ఏ రైతైనా తమకు సంబంధించిన భూ రికార్డులు కావాలని అర్జీ పెట్టుకుంటే వారికి తప్ప ఎవరికి ఎలాంటి విలువైన పత్రాలు ఇవ్వడానికి అనుమతి లేదన్నారు. రికార్డు సిబ్బంది ఆలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు