సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లు!

16-11-2026 | 05:30am
  1. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు
  2. మంత్రి దామోదర 

మెదక్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఒంటరి మహిళలు, వితంతువులు, ఇతర అరులైన వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన చేయూత పింఛన్ల కార్యక్రమాన్ని చేపట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Raja Narasimha) అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్నామని అయన స్పష్టం చేశారు.

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలో ఆదివారం టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్‌ల మంజూరు ఉత్తర్వులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల నూతన పింఛన్లు మంజూరు చేయగా, ఒక్క మెదక్ జిల్లాలోనే 11 వేల పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు.

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, డ్రోన్ల నిర్వహణ వంటి రంగాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు 1,400 ఇళ్లు కేటాయించగా, ఇప్పటివరకు 400 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు.

కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా కలెక్టర్  ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి  అంబదాస్ రాజేశ్వర్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, మెదక్ ఇంచార్జ్ ఆర్టీవో రామకృష్ణ, టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు

మరిన్ని వార్తలు