నర్సాపూర్ హైవేపై ఓపెన్ బార్?
- బహిరంగ మద్యపానానికి గ్రీన్ సిగ్నల్!
- హైవేపై మందుబాబుల ఆగడాలు
- ఇబ్బందులు పడుతున్న పాదచారులు
నర్సాపూర్, నవంబర్ 15: రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల(Traffic rules) అమలు విషయంలో మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్, ఎక్సైజ్ శాఖలు(Excise Departments) అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. నర్సాపూర్ పట్టణం నడిబొడ్డున 765డీ జాతీయ రహదారిపై ఉన్న వైన్స్ వద్ద నిత్యం జరుగుతున్న బహిరంగ మద్యపానంపై మాత్రం కళ్లు మూసుకుంటున్నారు.
నర్సాపూర్ పట్టణంలోని హైదరాబాద్ 765డీ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ వైన్ షాప్ వద్ద నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారు. పాదచారులు సురక్షితంగా నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్ గ్రిల్స్ లోపలి భాగం, పరిసరాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. మద్యం కొనుగోలు చేసిన వారు అక్కడే ఫుట్‌పాత్‌పై గుంపులుగా కూర్చుని బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు.
వైన్సుకు వచ్చే కస్టమర్లు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను ఇష్టారీతిన జాతీయ రహదారిపైనే పార్క్ చేస్తున్నారు. ఫుట్‌పాత్ ఆక్రమణకు గురికావడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో గ్రిల్స్ బయట ఉన్న ప్రధాన రహదారిపైకి వచ్చి నడవాల్సి వస్తోంది. వేగంగా దూసుకొచ్చే భారీ వాహనాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.
కాసుల మత్తులో అధికార యంత్రాంగం!
ప్రభుత్వ కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే ఇంతటి దందా జరుగుతున్నా ఎక్సైజ్, పోలీస్, మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్షం రోజుల క్రితం ఈ సమస్యపై పత్రికల్లో ఆధారాలతో సహా వార్తలు ప్రచురితమైనా, కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించి, బహిరంగ మద్యపానానికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
బృందావన్ వైన్స్ వద్ద ఫుట్పాత్ను రోజూ సాయంత్రం సమయంలో కొందరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని తమ దృష్టికి వచ్చింది. పర్మిట్ రూమ్ ఉన్నా లేకపోయినా నడిచే మార్గంలో ఇలా మందు తాగు తూ ఇబ్బంది కలిగించడం నేరం. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం.
ముస్తఫా, ఎక్సైజ్ సీఐ