మైథాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ మణిమ

16-11-2026 | 05:10am

శ్రీ ఫిలమ్స్ అండ్ ప్రొడక్షన్స్ పతాకంపై(banner of Sri Films and Productions) ‘మణిమ’ సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవీన్ నలమాస దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అమరేశ్ చంద్ర సారంగి నిర్మిస్తున్నారు.

ఇందులో పృథ్వీసాయి దండమూడి, జీషుసేన్ గుప్తా, కబీర్ దుహన్ సింగ్, బాబీ మిశ్రా నటిస్తున్నారు. ఈ సినిమా తారాగణంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లాప్ కొట్టారు. టాలీవుడ్ దర్శకుడు భీమనేని శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కు ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సినిమా నిర్మాత అమరేశ్ చంద్ర సారంగి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందించారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు పృథ్వీసాయి మాట్లాడుతూ.. “ఐఐటీ కృష్ణమూర్తి’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పట్టాను. ఆ తర్వాత ఇన్ని రోజులు మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూసా. ఈ కథ నచ్చడంతో ఒప్పుకున్నాను” అన్నారు. దర్శకుడు నవీన్ నలమాస మాట్లాడుతూ.. “ఈ సినిమా మైథాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా పూరీ జగన్నాథ్ స్వామి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాం.

ఈ నెల 16 నుంచి తొలి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లో రెండు షెడ్యూళ్లు, ఒడిషాలో ఒక షెడ్యూల్ నిర్వహిస్తాం. 30 శాతం వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంటుంది. వచ్చే ఏడాది జూలైలో జరిగే పూరీ జగన్నాథ్ రథయాత్ర సమయానికి సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు. నిర్మాత అమరేశ్ మాట్లాడుతూ.. “నేను పూరీ జగన్నాథ్ స్వామి వారికి భక్తుణ్ణి.

అందుకే ఆయన మీదే తీసి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నా. ఈ సినిమాను తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జగదీశ్ చీకటి, టీమ్ పాల్గొన్నారు. ఈ సినిమాకు ఎడిటర్-గా మార్తాండ్ కే వెంకటేశ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రాజీవ్ నాయర్ పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు