రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి సీతక్క
వెంకటాపూర్, నవంబర్ 16 (విజయక్రాంతి): రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) ప్రధాన లక్ష్యమని మంత్రి డా.సీతక్క(Minister Dr. Seethakka) అన్నారు. సోమవారం మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు విత్తనాలు, ఎరువులు, రుణాలు సకాలంలో అందించాలని, పీఏసీఎస్‌ను పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని నూతన చైర్మన్ కు సూచించారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
అనంతరం నూతన చైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన మంత్రి సీతక్కకు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అండగా ఉంటూ సంఘాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు చేన్నోజు శ్రీనివాస్, మాడుగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.