కోర్టు తీర్పును ధిక్కరించి స్థలం ఆక్రమణ

16-11-2026 | 09:48pm
  1. అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్‌ను తొలగించాలని బాధితుడి వినతి
  2. కోర్టు డిక్రీని అమలు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి
  3. ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు

బోధన్, నవంబర్ 16 (విజయ క్రాంతి): కోర్టు తీర్పు(Court Judgment) తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ, సొంత స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి అక్రమంగా రేకుల షెడ్ నిర్మించారని ఆరోపిస్తూ కోటగిరి గ్రామానికి చెందిన బర్ల ప్రవీణ్ కుమార్ సోమవారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించి, కోర్టు డిక్రీని అమలు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కోటగిరి గ్రామంలోని ఇంటి నంబర్ 17-65/1కు సంబంధించిన స్థలంపై తనకు పూర్తి హక్కులు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ స్థల వివాదంపై బోధన్ సీనియర్ సివిల్ కోర్టులో ఓఎస్ నంబర్ 303/2023 కింద కేసు దాఖలు చేయగా, విచారణ అనంతరం 2026 జూలై 3న స్థలం తనకే చెందుతుందని కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.

అయినప్పటికీ కోర్టు తీర్పును లెక్కచేయకుండా, స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో కొందరు వ్యక్తులు గ్రామపంచాయతీ అనుమతులు లేకుండానే రాత్రికి రాత్రే తన స్థలంలో అక్రమంగా రేకుల షెడ్ నిర్మించారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే గ్రామపంచాయతీ కార్యదర్శి, తహశీల్దార్, మండల పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు.

కోర్టు డిక్రీని పరిగణనలోకి తీసుకుని అక్రమంగా నిర్మించిన షెడ్‌ను తొలగించాలని, భవిష్యత్తులో ఆక్రమణదారులకు ఎలాంటి నిర్మాణ అనుమతులు, పన్ను అసెస్‌మెంట్లు మంజూరు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే కోర్టు తీర్పు ఆధారంగా గ్రామపంచాయతీ రికార్డుల్లో సదరు ఆస్తిని తన పేరున నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని బర్ల ప్రవీణ్ కుమార్ కోరారు.

మరిన్ని వార్తలు