calender_icon.png 2 October, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వడ్డీ ఆశ చూపి రూ.11 కోట్లు స్వాహా

02-10-2025 01:38:04 AM

  1. 28,493 మంది నుంచి రూ.4 వేల చొప్పున వసూలు
  2. నలుగురిని అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు

మహబూబాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): తక్కువ పెట్టుబడికి అధిక వడ్డీ ఇస్తామం టూ ఆశ చూపి 28,493 మంది నుంచి రూ.4 వే ల చొప్పున వసూలు చేసి, రూ.11 కోట్లు స్వాహా చేసిన నలుగురిని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ముఠా నుంచి రూ.5.92 లక్షల నగదుతో పాటు, 6,845 గ్రాముల బం గారు నాణాలు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, చెక్ బుక్స్, స్టాంప్స్‌తో పాటు పొలాలు, ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కేసు వివరాలను వరంగల్ సీపీ సన్ ప్రీత్‌సింగ్ వెల్లడించారు.

సూర్యాపే ట జిల్లా గడ్డిపల్లికి చెందిన ప్రధాన నిందితుడు సై దులు ప్రస్తుతం జనగామ జిల్లా పాలకుర్తి మం డల కేంద్రంలో నివాసముంటున్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మనుబోతుల రామకృష్ణ, సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్‌కు చెందిన పొడిల సురేష్ కుమార్, అదే జిల్లాలోని హుజూర్ నగర్‌కు చెందిన పొడిల శ్రీధర్ పాలకుర్తిలోనే నివాసముంటున్నారు.

సైదులు తన భార్య నారాయణమ్మ పేరు మీద హెబ్సిబా పేరుతో 2023లో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. 2024 సంవత్సరంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక లాభాలు ఆశ చూపిస్తూ చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ చిట్టీలో చేరే వారు ముందు గా రూ.ఆరు వేలు చెల్లించాల్సి ఉంటుంది. తొలు త సభ్యులు చెల్లించిన డబ్బులో రూ. నాలుగు వేలు డిపాజిట్ చేసుకొని..

ఈ సంస్థపై నమ్మకం కలిగించేందుకు మిగితా రెండు వేల రూపాయల విలువైన వస్తువులను అందజేస్తాడు. వాస్తవంగా ఈ వస్తువుల విలువ కేవలం మూడు వందలు మాత్రమే. ఈ సంస్థలో ఒక సభ్యుడు ఎన్ని సభ్యత్వాలైన పొందవచ్చు. ఇందులో చేరిన ప్రతి సభ్యుడికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 20 నెలల పాటు డబ్బును తిరిగి అందజేసేవాడు.

ఈ దందాను పెంచుకునేందుకు మిగిలిన ముగ్గురితో కలిసి గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని సుమారు 28,493 సభ్యత్వాలను నమోదు చేశారు. వీరి నుంచి రూ.4 వేల చొప్పున మొత్తం 11 కోట్ల రూపాయలు దోచుకున్నారు. సభ్యులకు కేవలం మూడు వందల రూపాయల విలువైన వస్తువులను అందజేయడం ద్వారా మరో రూ.4.14 కోట్ల మోసం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ సంస్థపై ఇటీవల పోలీసులకు పలు ఫిర్యాదులు రావడంతో పాటు ఈ ముఠా సభ్యులు ప్రజల సొమ్ముతో తప్పించుకుని పారిపోయే ప్రమాదాన్ని గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా వసూల్ చేసిన డబ్బును వివిధ 17 బ్యాంకుల్లో జమ చేసినట్లుగా గుర్తించి, రూ.5.48 కోట్లకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్యాంక్ ఖాతాలను నిలిపివేశారు.

కాగా ప్రధాన నిందితుడు సైదులుపై గతంలో మెదక్, సూర్యాపేట జిల్లాలతో పాటు ఇల్లందు, ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్లలో సుమారు పదికి పైగా చీటింగ్ కేసులు ఉన్నట్లు వరంగల్ సీపీ వెల్లడించారు.