శోభాయమానంగా హనుమాన్ విజయయాత్ర

24-04-2024 01:53:11 AM

ఆధ్యాత్మిక శోభ

హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వీరహనుమాన్ విజయయాత్ర’ శోభాయమానంగా జరిగింది. ఈ శోభాయాత్రలో దాదాపు ౩ లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయం ‘జై శ్రీరాం.. జై హనుమాన్’ నినాదాలతో మారుమోగింది.  

యాత్రలో పాల్గొన్న 3 లక్షల మంది భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన భాగ్యనగరం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): హనుమాన్ జయంతిని పురస్కరిం చుకుని హైదరాబాద్‌లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్తంగా నిర్వహించిన ‘వీర హనుమాన్ విజయయాత్ర’ అత్యంత శోభాయమానంగా జరిగింది. గ్రేటర్ వ్యాప్తంగా ఆంజనేయ స్వామి ఆలయాల్లో కనులపండువగా జయంతి వేడుకలు నిర్వహించారు. గౌలిగూడ రామమందిరం నుంచి వైభవోపేతంగా మొదలైన శోభాయాత్ర తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ దాకా కొనసాగింది. నగరంలోని బస్తీలు, కాలనీలు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్మోగాయి. సుల్తాన్‌బజార్, రామ్‌కోఠి, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, గాంధీనగర్, కవాడిగూడ, బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట, ప్యారడైజ్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయానికి ఈ శోభాయాత్ర చేరుకుంది.

ఈ యాత్రలో శ్రీరాముడు, హనుమాన్, అయోధ్య రామ్‌లల్లా విగ్రహాలతో పాటు మహానేతల విగ్రహాలను ప్రదర్శించారు. ఈ యాత్ర కొనసాగింపులో కోఠి యూనియన్ బ్యాంక్ చౌరస్తా వద్ద సామూహిక హనుమాన్ చాలీసా పఠనం చేశారు. వివిధ కూడళ్ల నుంచి వచ్చే హనుమాన్ విజయయాత్రలు ప్రధాన ర్యాలీకి పలు పాయింట్ల వద్ద కలిశాయి. హనుమాన్ శోభాయాత్రకు పలు ప్రాంతాలలో స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే ప్రాంతాలలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనే భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్నదానం చేశారు.

ఈ క్రమంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా, ఉన్నతాధికారుల పర్యవేక్షణతో ఈ యాత్ర ప్రశాంతంగా జరిగింది. నగర ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా ముందస్తుగా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు చేశారు. అల్లర్లు, వివాదాలకు అవకాశం లేకుండా మద్యం దుకాణాలను 24 గంటల పాటు బంద్ చేశారు. హనుమాన్ శోభాయాత్రలో సుమారు 3 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నట్టుగా పోలీసుల అంచనా.