హనుమాన్ చాలీసా విన్నా నేరమే!

24-04-2024 02:18:47 AM

l గత కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోదీ ఆగ్రహం

l మత విశ్వాసాలను ఆచరించడమూ కష్టమయ్యేది

l ప్రజల సొమ్మును దోచుకొని కొందరికి పంచిపెట్టే కుట్ర

l బంగారం లాక్కుని.. వారికే పంచిపెడతారా? 

l కాంగ్రెస్ రహస్యాలు బయటపెట్టానని వారికి కోపం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా విన్నా కూడా నేరం అనే పరిస్థితులు ఉండేవని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. గతంలో ఎవరి మత విశ్వాసాలను వారు ఆచరించడం కూడా కష్టతరంగా ఉండేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల సొమ్మును దోచుకుని ‘ఒక వర్గం’ వారికి పంచిపెట్టే పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు.

మంగళవారం రాజస్థాన్‌లోని టోంక్ సవాయి మాధోపూర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘మనమంతా హనుమాన్ జయంతి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ కొద్దిరోజుల కింద కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో జరిగిన ఉదంతానికి సంబంధించి ఓ ఫొటో గుర్తొచ్చి బాధ అనిపించింది. ఓ దుకాణదారుడు హనుమాన్ చాలీసా విన్నాడని కొందరు అతడిపై దాడి చేశారు. మీరే ఊహించుకోండి.. కాంగ్రెస్ హయాంలో కనీసం హనుమాన్ చాలీసా వినడం కూడా పెద్ద పాపం’ అని ప్రధాని మోదీ అన్నారు. 

రామనవమి వేడుకలపైనా నిషేధం

రాజస్థాన్‌లో శ్రీరామ నవమి వేడుకలపై కూడా కాంగ్రెస్ నిషేధం విధించిందని మోదీ గుర్తుచేశారు. కానీ తొలిసారిగా రాజస్థాన్‌లో రామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారని చెప్పారు. రామ్ రామ్ అని పలకరించుకునే రాజస్థాన్‌లో రామనవమి వేడుకలను కాంగ్రెస్ గతంలో నిషేధించిందని దుయ్యబట్టారు. సంపదను అందరికీ పంచిపెడతామని తాను హామీ ఇవ్వడంతో కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలకు కోపం వచ్చిందని, అందుకే ఎక్కడ చూసినా తనపై తిట్ల దండకం మొదలు పెట్టారని ఆరోపించారు. 

కట్టుబడి ఉంటా..

మగ‘వారి (కాంగ్రెస్) మ్యానిఫెస్టోలో బంగారం, సంపదపై సర్వే చేస్తామని పెట్టారు. సంపదను ఎక్స్‌రే తీస్తామని వారి నేతలు కూడా చెబుతున్నారు. తల్లులు, చెల్లెళ్ల దగ్గరున్న బంగారాన్ని కూడా వారు సర్వే చేస్తారట. దేశంలో సంపద, వనరులను మొదట వాడుకునే హక్కు ముస్లింలకే ఉందని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అంటే ప్రజల దగ్గరి నుంచి తీసుకున్న సంపదను ఎవరికి ఇస్తారు? వారికి ప్రత్యేకం అనిపించిన వారికి ఇస్తారు. ఎవరికి ఇస్తారో అర్థమైంది కదా. ఈ రహస్యాన్ని మోదీ బయట పెట్టగానే కాంగ్రెస్ వాళ్ల అసలు ఎజెండా బయటకు వచ్చింది. అందుకే ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. 2004 నుంచి 2010 మధ్య ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు సార్లు ప్రయత్నించింది. కానీ చట్టపరమైన ఇబ్బందుల వల్ల ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓ వర్గం వారిని మచ్చిక చేసుకోవడమే కాంగ్రెస్ సిద్ధాంతం.

రిజర్వేషన్లు కొనసాగుతాయి..

కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా కూడా.. మీకో గ్యారంటీ ఇస్తున్నా.. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనుల రిజర్వేషన్లను కొనసాగిస్తాం. ఈ రిజర్వేషన్లను వేరే మతం పేరిట పంచిపెడితే కూడా మేం ఊరుకోం. 2020లో రిజర్వేషన్ల గడువు ముగిసింది. కానీ అప్పుడు ఉన్న మా ప్రభుత్వమే రిజర్వేషన్లను కొనసాగిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది’ అని మోదీ చెప్పారు.

దేశాన్ని విభజించే కుట్ర..

రాజ్యాంగాన్ని గోవాపై రుద్దారంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ మన దేశాన్ని విభజించే కుట్ర చేస్తోంది. దేశం మొత్తం కాంగ్రెస్‌ను తిరస్కరించింది. అందుకే ఆ పార్టీ చిన్న చిన్న ద్వీపాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇప్పుడు గోవాలో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ వద్దంటున్నది. ఇక రేపు వాళ్లు అధికారంలోకి వస్తే దేశం మొత్తం ఇలాగే చేస్తుంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారతదేశ విజన్ అసలే లేదు. కనీసం ప్రజల సంక్షేమం గురించి ఏబీసీడీలు కూడా తెలియదు’ అంటూ మోదీ విమర్శల పర్వం కొనసాగించారు.

* రామ్ రామ్ అని పలకరించుకునే రాజస్థాన్‌లో రామనవమి వేడుకలను కాంగ్రెస్ గతంలో నిషేధించింది.  కానీ తొలిసారిగా రాజస్థాన్‌లో రామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. సంపదను పంచిపెడతారని నేను బయట పెట్టడంతో కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలకు కోపం వచ్చింది. అందుకే ఎక్కడ చూసినా నాపై తిట్ల దండకం మొదలు పెట్టారు. 

 ప్రధాని 

నరేంద్ర మోదీ