26-07-2024 04:45:03 AM
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప రాష్ట్ర బడ్జెట్‌లో ఏమీ లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ కనిపించలేదని అన్నా రు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఏటా రైతులకు పంట సీజన్ ముందు ఇవ్వాల్సిన పంట పెట్టుబడి సాయానికి (రైతు భరోసా) బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవని, ఇది రైతులను మోసం చేయడమేనని దుయ్యబట్టారు.
‘బడ్జెట్‌లో ఆసరా పెన్షన్ల ప్రస్తావనే లేదు. పెన్షన్లు పెంచుతామని మోసం చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదు’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. దళిత సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ.21,072 కోట్ల నుంచి.. రూ.7,638 కోట్లు తగ్గిపోయిందని, గిరిజన సంక్షే మ బడ్జెట్ రూ.4,365 కోట్ల నుంచి.. రూ.3,969 కోట్లకు కోత విధించారని విమర్శించారు.
మొత్తం ప్రపంచం ఏమైపోయినా ఫర్వాలేదు కానీ మైనారిటీల సంతుష్టీకరణ మాత్రమే కావాలనే కాంగ్రెస్ ఆలోచన మరోసారి ఈ బడ్జెట్‌లో బట్టబయలైందని ఆరోపించారు. 2023 రూ.2 వేల కోట్లుగా ఉన్న మైనార్టీ సంక్షేమ నిధులను.. ఈ బడ్జెట్‌లో ఏకంగా రూ. 3,003 కోట్లకు పెంచారని, ఏడాదిలోనే 30% ఈ కోటా బడ్జెట్ పెంచేశారని ఆరోపించారు.
ఆటో డ్రైవర్లను మర్చిపోయారు
కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్.. బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విద్యానిధి పథకం కింద రూ.5 లక్షల సాయం చేస్తామని చెప్పినా.. బడ్జెట్‌లో దాని ప్రస్తావన లేదని, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన మాట హామీగానే ఉండిపోయిందని విమర్శించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ద్వారా రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. గత పదేండ్లలో బడ్జెట్‌లో సరిపో ను నిధులు కేటాయించకపోవడంతో తెలంగా ణ లో విద్యా వ్యవస్థ మొత్తం విధ్వంసమైందని అన్నారు. విద్యారంగాన్ని బాగు చేయడానికి బడ్జెట్‌లో ఆ రంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా 7 శాతమే ఇచ్చారని తెలిపారు.
రాష్ర్టంలో ఆదాయ మార్గాలేమిటో.. నిధు లు ఎలా సమకూర్చుకుంటారో ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించలేదని విమర్శించారు. గత సర్కా రు చేసినట్టే.. ప్రభుత్వ భూములన్నీ అమ్మాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. గత సర్కారు విచ్చలవిడిగా చేసిన అప్పు లు కట్టేందుకు, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు మరిన్ని అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలపై ఇప్పటికే ఉన్న రుణభారాన్ని తగ్గించాల్సింది పోయి మరింతగా పెంచు తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని నిరూపితమైందని విమర్శించారు.