calender_icon.png 22 November, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యకు 21 వేల కోట్లు

26-07-2024 04:48:48 AM

  1. గతేడాదితో పోల్చితే రూ.2,199 కోట్లు అధికం 
  2. వర్సిటీలకు పెరగని కేటాయింపులు 
  3. వర్సిటీల్లో మౌలికవసతులకు రూ.500 కోట్లే 
  4. మ్యానిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులని కాంగ్రెస్ హామీ 
  5. 2024 బడ్జెట్‌లో 7.3 శాతానికే సరిపెట్టిన సర్కారు 
  6. గతేడాది బబ్జెట్‌లో విద్యకు 19,093 కోట్లు కేటాయింపు

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్‌లో గతేడాదితో పోలిస్తే విద్య రంగానికి స్వల్పంగా కేటాయింపులు పెంచుతూ రూ. 21,292 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. 2023లో 19,093 కోట్లను ఇవ్వగా ఈ ఏడాది రూ.2,199 కోట్లు అదనంగా ఇచ్చారు. కాగా, కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యకు పేర్కొన్న విధంగా 15 శాతంలో సగానికి కూడా కేటాయింపులు మించలేదు.

రాష్ట్రంలో విద్యకు ఎప్పుడూ అరకొర నిధులే కేటాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత ఓటాన్ అకౌంట్ బడ్జె ట్ కన్నా ప్రస్తుతం నిధులు తక్కువగా కేటాయించారు. గత ఓటాన్‌లో రూ.21,389 కోట్లు ఇవ్వ గా ప్రస్తుతం రూ.21,292 కోట్లకు తగ్గించారు. ఈ నిధులతో విద్య రంగం ఏమాత్రం వృద్ధి సాధించదని విద్యార్థి నేతలు, ఉపాధ్యాయం సంఘాలు, మేధావులు చెబుతున్నారు.

బడ్జెట్‌లో ఎప్పుడూ 10 శాతంలోపే విద్యకు కేటా యిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం 10.89 శాతం నిధులు కేటాయించగా ఆ తర్వాత క్రమంగా తగ్గిస్తూ 2023 బడ్జెట్‌లో 6.57 శాతానికి పరిమితం చేశారు. ఇప్పుడు కాస్త పెంచి 7.3 శాతంగా కేటాయించారు.

ఉన్నత విద్యకు రూ.3,350 కోట్లు 

ఈ ఏడాది బడ్జెట్‌లో ఉన్నత విద్యకు రూ. 3,350 కోట్లు కేటాయించగా సెకండరీ విద్యకు రూ.17,942 కోట్లు అందిస్తున్నారు. గతేడాది బడ్జెట్‌లో సెకండరీ విద్యకు రూ.16,092 కోట్లు ఇవ్వగా ఉన్నత విద్యకు రూ.3,001 కోట్లు కేటాయించారు. మరోవైపు గత ప్రభుత్వం ప్రవేశపె ట్టిన మన ఊరు బడి పథకం గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీలపైనా ప్రస్తావించకపోవడం గమనార్హం.

వర్సిటీలకు అంతంతే..

ఎప్పటిలాగే యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభు త్వం బడ్జెట్‌లో పెద్దగా ఆసక్తి చూపలేదు. వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 500 కోట్ల నిధులు ప్రతిపాదించారు. దీనిలో రూ.100 కోట్లు ఉస్మానియా వర్సిటీకి, మరో రూ.100 కోట్లు మహిళా వర్సిటీకి కేటాయించారు. మిగతా నిధులు కాకతీయ, ఇతర వర్సి టీలకు అందివ్వనున్నారు. ప్రతి బడ్జెట్‌లోనూ వర్సిటీలకు రూ.500 కోట్లకు మించి కేటాయింపులు జరగడం లేదు.

ప్రభుత్వ నిర్ల క్ష్యం వల్లనే వర్సిటీలు అంధకారంలో ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. అరకొర నిధులతో పరిశోధనలు పడకేశాయని, నియామకాల్లోనూ జాప్యం జరు గుతోందని ఆరోపణలు ఉన్నాయి. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖాళీలు దాదాపు 4,500 వరకు ఉన్నాయి.

త్వరలో వీసీల నియామకాలంటూ.. 

ఈ ఏడాది మే 21తో 10 వర్సిటీల వీసీల పదవీకాలం పూర్తయింది. వీరి నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ వేసి, సెర్చ్ కమిటీలను కూడా ఇప్పటికే ప్రభుత్వం నియమించింది. కానీ, ఈ సెర్చ్ కమిటీలు ఇంత వరకూ సమావే శం కాలేదు. ప్రస్తుతం వర్సిటీలకు ఐఏఎస్ అధికారులు ఇన్‌చార్జి వీసీలుగా కొనసాగు తున్నారు. పూర్తిస్థాయి వీసీలను ఎప్పుడు నియమిస్తారో స్పష్టత ఇవ్వలేదు. .

కామన్ బోర్డు ప్రస్తావనేది?

రాష్ట్రంలోని 65 ఐటీఐలను ప్రైవేట్ సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం వర్సిటీల్లో నియామకాలకు సంబంధించి యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురించి పెద్దగా ప్రస్తావించలేదు. గత ప్రభుత్వం అన్ని వర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ  ఫైలును రాష్ట్రపతి కార్యాలయానికి అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పంపించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదని విమర్శులు వస్తున్నాయి.