26-07-2024 04:42:07 AM
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ‘గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజం. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క మీరు చదివింది రాష్ట్ర బడ్జెట్టా లేక అప్పుల పత్రమా..? అప్పులున్నందున ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? రాష్ట్ర బడ్జెట్ గాడిద గుడ్డేనా? అందుకే ఆ గ్యారెంటీలకు నిధులు కేటాయించలేదా? ఆరు గ్యారెంటీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా ?’ అని గురువారం రాష్ట్రబడ్జెట్‌పై ఓ ప్రకటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు.
బడ్జెట్ కేటాయింపులకు సరిపడా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో బడ్జెట్‌లో లెక్కా పత్రం చూపకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరుకు అమ్మాలనుకుంటున్నారా..? అని నిలదీశారు. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్రప్రభుత్వం ఏకంగా 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి, ఇప్పుడు బడ్జెట్‌లో పైసా కేటాయించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ఎద్దేవా చేశారు.
ముస్లింలు జరుపుకొనే రంజాన్ వేడుకలకు బడ్జెట్‌లో రూ.33 కోట్లు కేటాయించి, హిందూ పండుగలకు నయాపైసా కేటాయించకపోవడం మత తత్వం కాదా? ఒక వర్గం ఓట్ల కోసం మెజారిటీ హిందువులకు నష్టం చేయడమేనా మైనారిటీ డిక్లరేషన్ అంటే అని అని ప్రశ్నించారు. రుణమాఫీతో రైతులకు లాభం కంటే నష్టమే జరుగుతుందన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుంచి వారిని తొలగించాలన్నారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు తక్కువ నమోదు కావడమే పదేళ్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ పాలనలో కేబినెట్ మంత్రుల మధ్యే సఖ్యత లేదని, వారు రాష్ట్రంలో సమ సమాజం స్థాపిస్తామనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ఊసే లేదని, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని గొంతెత్తిన సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు రాజీనామా చేయగలరా? అని ప్రశ్నించారు. బడ్జెట్ లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన రాష్ట్రానికి అన్యాయం చేసినట్లు కాదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్‌కార్డులుంటే, ఇప్పటివరకు కేవలం 39 లక్షల కుటుంబాలకే గ్యాస్ సబ్సిడీ వర్తించిందన్నారు. 50 లక్షల మంది అర్హులకు సబ్సిడీని ఎగ్గొట్టి, ఇంటింటా వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులు వినియోగిస్తారని బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం విడ్డూరమన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీలు వచ్చే ఐదేళ్లలో అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్‌లోనే తేలిందని స్పష్టం చేశారు.