calender_icon.png 25 September, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర అభివృద్ధికి పెద్దపీట

25-09-2025 12:20:59 AM

  1. స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయాలకు ఆమోదం
  2. లోయర్ ట్యాంక్ బండ్ ఫ్లుఓవర్‌కు తెలంగాణ తల్లి ఫ్లుఓవర్‌గా నామకరణానికి ఆమోదం
  3. వరద నివారణ, క్రీడా మైదానాల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి ): గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి, పౌర సౌకర్యాల మెరుగుదలే లక్ష్యంగా జీహెఎంసీ స్టాండింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటమ్స్‌తో కలిపి మొత్తం 24 ప్రతిపాదనలను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. లోయర్ ట్యాంక్ బండ్ ఫ్లుఓవర్‌కు ‘తెలంగాణ తల్లి ఫ్లుఓవర్’గా నామకరణం చేయడం, వరద నివారణకు బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం, క్రీడా మైదానాల ఆధునికీకరణ వంటి ముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నాయి.

ఆమోదం పొందిన ముఖ్య ప్రతిపాదనలు..

మౌలిక సదుపాయాలు.. అల్వాల్‌లో రూ.2.95 కోట్లతో, నాగోల్‌లో రూ.2.98 కోట్లతో, కాప్రాలో రూ.3.95 కోట్లతో, చర్లపల్లిలో రూ.2.85 కోట్లతో వరద నివారణకు బాక్స్ డ్రెయిన్ల నిర్మాణానికి కమిటీ ఆమోదముద్ర వేసింది. యాకుత్‌పురలోని ఎస్.ఆర్. టి కాలనీలో లండన్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి, పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది.నగరానికి ఐకానిక్‌గా నిలిచేలా, లోయర్ ట్యాంక్ బండ్ నుం డి సెక్రటేరియట్ వరకు నిర్మించిన ఫ్లుఓవర్‌కు ‘తెలంగాణ తల్లి ఫ్లుఓవర్’గా నామ కరణం చేయాలన్న ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది.

మల్లేపల్లిలో రూ.4.85 కోట్లతో ఫుట్‌బాల్ గ్రౌండ్ ఆధునికీకరణకు, ఆర్.కే.పురం ఫ్లుఓవర్ కింద స్పోర్ట్స్ జోన్ నిర్వహణకు, మాధాపూర్, శిల్పా హిల్స్, కృష్ణానగర్‌లలో శ్మశానవాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. ప్రత్యేక సందర్భాల్లో నగరంలోని మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేయించే అధికారాన్ని కమిషనర్‌కు కట్టబెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెఎంసీ అవుట్‌సోర్సింగ్, స్వయం సహాయక సంఘాల వర్కర్ల జీతాల ఖాతాలను ప్రైవేట్ బ్యాంకులకు మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

దీంతో వారికి మెరుగైన బీమా సౌకర్యాలు అందనున్నాయి. అలాగే జీహెఎంసీ ప్రధాన కార్యాల యంలో ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’ నిర్వహణ బాధ్యతలను స్నేహిత స్వయం సహాయక సంఘానికి అప్పగించారు. ఈ సమావేశంలో జీహెఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.