02-05-2025 01:12:07 AM
ఇందిరా మహిళా శక్తి సమీక్షలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, మే 1(విజయ క్రాంతి): జిల్లాలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోనీ మిని సమావేశ మందిరంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా సాధికారతలో భాగంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అందులో భాగంగా డ్రోన్లు , మహిళా పెట్రోల్ బంకులు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇటుకల తయారీ, విద్యార్థులకు ఏకరూప దుస్తుల కుట్టు లాంటి కార్యక్రమాలు జిల్లాలో మహిళలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. మహిళా సంఘాల మహిళలు వారి ఉత్పత్తులైన లక్క బొమ్మలు, జూట్ బ్యాగులు తయారుచేసి సంగారెడ్డి జిల్లా పేరు మీద మంజీరా మహిళా శక్తి అనే స్టాల్ ను శిల్పారామంలో ఏర్పాటు చేసి వాటిని విక్రయించి జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు తేవాలన్నారు.
న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల్లో ఉన్న మహిళలందరూ తప్పనిసరిగా 100 శాతం అక్షరాస్యత కలిగి ఉండాలన్నారు. డ్రోన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు 80% సబ్సిడీ కింద డ్రోన్లు అందించలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పిడి డిఆర్డిఏ జ్యోతి, పిడి మెప్మా గీత, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.