30-01-2026 02:09:22 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 29 (విజయక్రాంతి): రాష్ర్టంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పట్ల బీసీ రాజ్యాధికార సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా అట్టడుగు బీసీ, బహుజన వర్గాలు ఆరాధ్యదైవాలుగా కొలిచే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఆయా వర్గాల ఆత్మగౌరవాన్ని హననం చేయడమేనని సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ మండిపడ్డారు.
గురువారం బాగ్‌లింగంపల్లిలో ఆయన ఎన్నికల కమిషన్, ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికలను హడావిడిగా, ఆకస్మికంగా జాతర సమయంలోనే ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రజలు కుటుంబ సమేతంగా దేవతారాధనలో ఉం డే సమయంలో వారి మనోభావాలను దెబ్బతీస్తూ ఎన్నికలు జరపడం సరికాదన్నారు. ప్రజల ఆత్మసంతప్తిని హరిస్తున్న ఈ ఎన్నికల షెడ్యూల్‌ను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీసీల భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు శుక్రవారం ఉదయం 10 గంటలకు బాగ్ లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలో వ్యూహాత్మక సమావేశం నిర్వహించనున్నట్లు సురేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ర్టంలోని పలువురు తాజా, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కుల సంఘాల నేతలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.