calender_icon.png 9 July, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు టోకరా పెట్టేందుకు ఓ వ్యాపారి పన్నాగం

09-07-2025 12:34:18 AM

  1. 195 మంది వద్ద రూ.6.95 కోట్ల వసూలు
  2. వ్యాపారి ఇంటి వద్ద ఆందోళన చేసిన రైతులు 

మంచిర్యాల, జూలై 8 (విజయక్రాంతి): జిల్లాలో అమాయకుల వద్ద అప్పులు చేసి ఐపీలు పెట్టి పారిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొదట నమ్మకంగా ఉంటూ, బిజినె స్, ఇతర లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు నటిం చి కోట్ల రూపాయలు అప్పుల రూపంలో తీసుకొని మెల్లగా జెండా ఎత్తుతున్నారు.

లక్షెట్టిపేట పట్టణంలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా, వ్యాపారుల వద్ద అప్పులు చేసి ఉడాయించి ఐపీ పెట్టేందుకు ప్రయత్నాలు జరుపుతున్న ఓ వ్యాపారి వ్యవహారం మంగళ వారం వెలుగులోకి వచ్చింది.

వ్యాపారి ఇంటి వద్ద ఆందోళన ...

దండేపల్లి మండలానికి చెందిన పలువురు రైతుల వద్ద ప్రైవేటుగా వరి ధాన్యం కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సిన మద్ధతు ధర చెల్లించకుండా, డబ్బులు అడిగితే రేపు, మాపంటూ తింపుతుండటంతో మంగళ వారం పెద్ద మొత్తంలో రైతులు లక్షెట్టిపేటలోని వ్యాపారి శ్రీధర్ ఇంటి వద్దకు చేరుకున్నారు.

వ్యాపారి ఐపీ పెడుతున్నాడని తెలిసి ఇంటి గోడలపై ఈ ఇల్లు దండేపల్లి మండల రైతులకు చెందిందంటూ వాల్ రైటింగ్ రాసి ఇంటి వద్ద నిరసన తెలిపారు. రైతులే కాకుండా లక్షెట్టిపేట పట్టణంలోని వ్యాపారుల వద్ద నుంచి కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. 

195 మంది వద్ద రూ. 6.95 కోట్ల వసూలు...

లక్షెట్టిపేట పట్టణానికి చెందిన శ్రీధర్ అనే వ్యాపారి రైతులు, వ్యాపారుల వద్ద నుంచి రూ. 6.95 కోట్లు అప్పుల రూపంలో తీసుకొని దివాళా చట్టం (ఇన్ వాల్వెన్సీ పిటీషన్) దాఖలు చేస్తున్నట్టు సమాచారం. తాను నష్టపోయానంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఐపి పిటిషన్ దాఖలు చేసినట్లు, ఆ కోర్టు నుంచే 195 మంది బాఖీదారులకి ఆ వ్యాపారి ప్రస్తుతం ఐపి నోటీసులు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

ఈ పరిణామాలతో నష్టపోయిన రైతులు, వ్యాపారులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఇప్పటికే కొందరు బాధితులు సంబంధిత వ్యాపారి పై న్యాయపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం.