08-09-2025 12:04:53 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్న కల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) వరకు ప్రస్తుతం ఉన్న బ్రాంచ్ రైల్వే లైన్ డబ్లింగ్ కోసం అవసరమైన భూసేకరణకు రైల్వే శాఖ గెజిట్ విడుదల చేసింది. 355 మంది రైతుల నుంచి 32.3 ఎకరాల భూమి సేకరించనున్నారు. డబ్లింగ్ పనులు పూర్తయితే డోర్నకల్ - కొత్తగూడెం మధ్య బొగ్గు రవాణా తో పాటు ప్యాసింజర్ రైళ్లకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రస్తుతం సింగిల్ లైన్ ఉండడంతో ఎగువ, దిగువ మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తరచుగా ఆటంకం కలుగుతోంది. దీనితో ప్యాసింజర్ రైళ్లతో పాటు బొగ్గు రవాణా రైళ్లను ఆలస్యంగా నడపాల్సిన పరిస్థితి నెలకొంది. డబ్లింగ్ పనులు పూర్తయితే ఎగువ, దిగువ మార్గాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా రైళ్ల రాకపోకలు సాగుతాయి. ఇందు కోసం 2008 - 09 సంవత్సరంలో రైల్వే శాఖ బడ్జెట్లో డోర్నకల్ జంక్షన్ మణుగూరు మధ్య 104 కిలోమీటర్ల పొడవైన సింగిల్ రైల్వే ట్రాక్ ను డబ్లింగ్ చేయడంతో పాటు విద్యుదీకరణ చేపట్టాలని ప్రతిపాదించింది.
ఆ మేరకు సర్వే నిర్వహించారు. అనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన చేసి అప్పట్లో విద్యుదీకరణతో పాటు డబ్లింగ్ పనులకు నిధుల కోసం ప్రతిపాదన పంపారు. అయితే ఆ తర్వాత పలు మార్పులు చేసి డోర్నకల్ జంక్షన్ - భద్రాచలం రోడ్డు మధ్య 54.43 కిలోమీటర్ల పొడవు ట్రాక్ నిర్మాణానికి 770.12 కోట్లు అంచనాతో పనులను ప్రతిపాదించారు. గత ఏడాది రైల్వే శాఖ ఇందుకు ఆమోదం తెలిపి 100 కోట్లు కేటాయించింది.
ఈ నేపథ్యంలో రెండో లైన్ అవసరమైన భూ సేకరణకు రైల్వే శాఖ తాజా గెజిట్ విడుదల చేయడంతో డబ్లింగ్ పనులు ప్రారంభించడానికి తొలి అడుగు పడింది. డోర్నకల్ జంక్షన్ భద్రాచలం రోడ్డు వరకు డబ్లింగ్ పూర్తయితే రైళ్ల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రతిరోజు నాలుగు ప్యాసింజర్ రైళ్లు, 17 వరకు గూడ్స్ రైలు నడుపుతున్నారు.
ఒకే మార్గంలో ఎగువ దిగువ రైళ్లు వెళ్లడం వల్ల రైళ్ల రాకపోకలను పెంచడానికి అవకాశం లేకుండా పోయింది. డబ్లింగ్ పనులు పూర్తయితే ఈ రైళ్ల సంఖ్య కూడా పెరుగుతాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు అదనంగా సిబ్బంది సంఖ్య పెరుగుతుందని, రైల్వే శాఖకు అదనపు ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రైల్వే రవాణా వ్యవస్థ మెరుగుకు డబ్లింగ్ పనులు మరింత దోహదపడతాయని చెబుతున్నారు.
అలాగే డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందడంతో పాటు ఎలక్ట్రిక్ లోకో షెడ్, కోచ్ ఫ్యాక్టరీ, మెము కార్ షెడ్ తదితర సౌకర్యాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే డోర్నకల్ నుంచి పోచారం, కారేపల్లి, గాంధీపురం హాల్ట్, చీమల పహాడ్, తడకలపూడి, బేతంపూడి, భద్రాచలం రోడ్డు వరకు ఉన్న స్టేషన్లో అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
డబ్లింగ్ పనులు పూర్తయితే ప్రయాణికుల రైళ్లు కొత్తగా ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకోవడానికి భక్తులకు మెరుగైన రైల్వే వ్యవస్థ అందుబాటులోకి రానుంది.