calender_icon.png 25 August, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్ఫ్‌లో మరణ మృదంగం

14-06-2024 12:00:00 AM

ఎడారి దేశం కువైట్‌లోని మంగాఫ్ పట్టణంలో భారతీయ కార్మికులు నివసించే ఆరంతస్థుల భవనంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో  దాదాపు 50 మంది సజీవ దహనమయిన ఘటన గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల దుర్భర పరిస్థితులకు మరోసారి అద్దం పట్టింది.  మృతుల్లో  21 మంది ఒక్క కేరళ రాష్ట్రానికే చెందిన వారని అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారూ మృతుల్ల్లో ఉన్నారు. గాయపడిన మరో 50 మంది ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు.  చనిపోయిన వారిలో చాలామంది గుర్తు పట్టడానికి వీలు లేనంతగా కాలిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం వెంటనే స్పందించి ఘటనా స్థలానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి నేతృత్వంలో ఆ శాఖకు  చెందిన ఉన్నతాధికారుల బృందాన్ని పంపించింది. 

మృతదేహాలను గుర్తు పట్టడంతో పాటు స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కువైట్ ప్రభుత్వానికి వీరు సహకరించనున్నారు. భవన యజమానితో పాటు ఘటనకు బాధ్యులయిన వారిని తక్షణం అరెస్టు చేయాలని కువైట్ హోంమంత్రి ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారు, ప్రాణాలతో బయటపడిన వారంతా ఒకే కంపెనీలో పని చేస్తున్న వారని తెలుస్తోంది. వీరు నివాసం ఉండడానికి ఆ కంపెనీ ఆరంతస్థుల భవనాన్ని అద్దెకు తీసుకుంది. అందులో దాదాపు 195 మంది ఉంటున్నారు. కార్మికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

వనం మెట్ల పైనకూడా కొన్ని మృతదేహాలు ఉండడం ప్రమాద తీవ్రతకు అద్ద పడుతోంది. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు హృదయవిదారకంగా ఉన్నాయి. మృతులంతా 20 ఏళ్లనుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులని తెలుస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో పొట్ట చేతపట్టుకుని వెళ్లిన వీరంతా ఎడారి దేశంలో విగతజీవులుగా మారారు. ప్రభుత్వాలు ఎంత ఆర్థిక సాయం చేసినా వీరి కుటుంబాల కడుపు కోత తీరుతుందా?

గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం భారత్‌నుంచి ప్రతి ఏటా వేలాది మంది వెళ్తుంటారు. ఈ వలసలు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గల్ఫ్ దేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 30 లక్షలమంది వలస కార్మికులు ఉన్నారు. స్వరాష్ట్రాల్లో వీరిపై ఆధారపడిన భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు కలిపితే దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. అంతేకాదు, ఆయా దేశాలనుంచి వీరు ఏటా కోట్ల రూపాయలు స్వస్థలాలకు పంపిస్తుంటారు.  దీనిద్వారా ప్రభుత్వాలకూ ఆదాయం వస్తోంది. ఇంత పెద్ద సమస్య అయినప్పటికీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా వీరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. 

కేరళనుంచి ఈ దేశాలకు వెళ్ల్లే వాళ్లు ఎక్కువ మంది ఉండడంతో అక్కడి ప్రభుత్వం వీరి సమస్యల పరిష్కారానికి  కొంతమేరకు ప్రయత్నిస్తోంది. ఇళ్లూ, పొలాలు, పెళ్లాల పుస్తెలు తెగనమ్మి ఏజంట్ల చేతుల్లో వేలాది రూపాయలు పోసి నానా కష్టాలు పడి గల్ఫ్ దేశాలకు చేరుకుంటున్న  వీరంతా అక్కడికి వెళ్లాక  అసలు కష్టాలు మొదలవుతున్నాయి. మంచి జీతాలు ఆశ చూపించి తీసుకెళ్లిన ఏజంట్లు అక్కడ వీరిలో చాలామందిని కట్టుబానిసలను చేస్తున్నారు. షేక్‌ల ఇళ్లలో రకరకాలు పనులు చేస్తూ బతుకు వెళ్లదీస్తున్నారు.

ఏ పాటి చిన్న తప్పు జరిగినా జైలు పాలవుతున్నారు. ఆరు గల్ఫ్ దేశాల్లో 4,755 మంది భారతీయులు డీపోర్టేషన్ సెంటర్లు,  జైళ్లలో మగ్గుతున్నట్లు సాక్షాత్తు విదేశాంగ శాఖే  వెల్లడించింది. వీరిలో దాదాపు 500 మంది మన తెలంగాణకు చెందిన వారే ఉన్నారు.  రాష్ట్రంలో ఇటీవల  ఎన్నికల సందర్భంగా గల్ఫ్‌లోని వలస కార్మికుల సమస్య పరిష్కారానికి  ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా  ఎలాంటి చర్యలూ లేవు. కువైట్ ఘటన తర్వాతనైనా ఆ దిశగా కార్యాచరణ మొదలైతే బాగుంటుంది.