calender_icon.png 25 August, 2025 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయా జమాన పెళ్లికి దూరం

14-06-2024 12:00:00 AM

నేటి యువత పెళ్లి చేసుకోవడానికి ఇష్ట పడడం లేదని, పరిణయం అంటేనే మోయలేనంత బరువు అని విచిత్రంగా, ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం చూస్తున్నాం. నయా జమానా యువత పెళ్లిని 30 ఏండ్లు దాటే వరకు వాయిదా వేయడం లేదా వివాహమే వద్దంటూ కఠిన నిర్ణయాలను తేలికగా తీసుకుంటూ భీష్మించుకొని కూర్చుంటున్నారు. ఆధునిక యువత సమాజ కట్టుబాట్లు కాదని, ఒంటరి జీవితాలను ఆహ్వానిస్తూ బ్రహ్మచారులుగా కాలం గడుపుతున్నారు. ఇందులోనే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పొందుతూ సుఖపడుతున్నట్లుగా వారు భ్రమ పడుతున్నారు.

1997 మధ్య జన్మించిన 12 ఏండ్ల వయసున్న జూమర్స్ లేదా జెనరేషన్ జెడ్ యువత తమ ఉన్నత చదువులు, ఆకర్షణీయ ఉద్యోగాల్లో స్థిరపడాలనే లక్ష్యంతో వివాహాలను వాయిదా వేయడం లేదా పెళ్లి అనే సంకెళ్లకు దూరంగా ఉండడానికి సిద్ధ పడుతున్నారు. నేటి డిజిటల్ సమాజంలో యువతీ యువకులు సమాన ఉద్యోగాలు చేయడం, ఉన్నత చదువులు చదవడంతో వయస్సు ముప్పుదాటి ముదిరిపోవడం, పెళ్లిపట్ల ఆసక్తి కొరవడడం, లింగ సమానత్వం అంటూ ఉడుం పట్టు పట్టుకొని కూర్చోవడం, పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే కొద్దిపాటి సమస్యలను భూతద్దంలో చూసి విడాకులతో విడిపోవడం సర్వసాధారణం అవుతున్నది. 

15 ఏండ్ల భారతీయ యువతలో 23 శాతం మంది పెళ్లి అంటే ఇష్టపడడం లేదని, 2005 20 ఏండ్ల యువతులు 72.4 శాతం వివాహాలు చేసుకోగా, 2019 52.8 శాతం మహిళలు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తున్నది. 2019- 25 ఏండ్ల వయసున్న యువకులు 42.9 శాతం, 83 శాతం మహిళలు వివాహాలు చేసుకున్నట్లు స్పష్టం అవుతున్నది. పెళ్లివల్ల కుటుంబ భారం పడుతుందని, పిల్లల్ని కనడం, వారి పెంపకం ఖర్చులు పెరగడం, ఆలనా పాలన చూడడం, జీవితంలోని ఆనంద క్షణాలకు అడ్డుకట్టలు పడుతాయనే అతి విచిత్ర ఆలోచనల వలయంలో నేటి యువత బందీ అవుతున్నది.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పట్టణీకరణ, భూమి కుగ్రామంగా మారడం, పలు జాతీయ అంతర్జాతీయ ఆచార వ్యవహారాలు పరిచయం కావడం, పబ్ కల్చర్, డేటింగ్ సంస్కృతులు వ్యాప్తి కావడం లాంటి చట్రాల్లో బంధించబడిన భారతీయ యువత అసాధారణ ఆలోచనల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సాంప్రదాయ కట్టుబాట్లను ముళ్లకంచెలవలె భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఆరోగ్యకరమైన మార్పును కోరుకోవడం తప్ప మనం మరేమీ చేయలేం. 

 డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి