calender_icon.png 22 November, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కొక్కరి పేరిట రూ.50 వేల అప్పు

26-07-2024 04:34:10 AM

  1. 6 వేలకు పైగా రైతుల పేరు మీద రుణాలు 
  2. వెలుగులోకి గాయత్రీ, మాగీ ఫ్యాక్టరీ లీలలు 
  3. రుణాలపై తమకేమీ తెలియదంటున్న రైతులు 
  4. రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య 
  5. సమగ్ర విచారణ జరపాల్సిందేనని రైతుల డిమాండ్ 
  6. ఫ్యాక్టరీ బాగోతంపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ 

కామారెడ్డి, జూలై 25 (విజయక్రాంతి): రైతులకు తెలియకుండా రైతుల పేరుమీద రుణాలు తీసుకున్న గాయత్రీ, మాగి ఫ్యాక్టరీ లీలలు విస్తుగొలుపుతున్నాయి. ఒక్కో రైతు పేర రూ.౫౦ వేల చొప్పున దాదాపు 6 వేల మంది రైతుల పేరు మీద అప్పు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ మూడు సార్లు రుణమాఫీ జరిగినా బాధిత రైతులకు తెలియకపోవడం గమనార్హం. కామారెడ్డి జిల్లా లోని సదాశివనగర్ మండలం అడ్లూర్‌ఎల్లారెడ్డి గాయత్రీ షుగర్స్, నిజాంసాగర్ మండ లం మాగి వద్ద గల గాయత్రీ షుగర్స్ పరిధిలోని సుమారు 6 వేల మంది రైతుల పేరు మీద ఫ్యాక్టరీ యాజమాన్యం దాదాపు రూ.30 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.

విషయం బయటకు పొక్కడంతో కంపెనీ యాజమాన్యం అప్రమత్తం అయ్యింది. రైతులకు తెలిసే అన్ని జరుగుతున్నాయని, గత ౨౦ ఏళ్లుగా రుణాలు తీసు కుంటున్నామని  కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు చెప్పడం గమనార్హం. కాగా, తమ పేరుపై ఫ్యాక్టరీ యాజమాన్యం రుణం తీసుకున్నట్టు తెలిసిందని సదాశివనగర్ మండలం పోసానిపేట్ కు చెందిన రైతులు బలగం వెంకట్‌రాములు, కుర్మ బీర య్య, సుతారి బాలయ్య, తాడ్వాయి అశోక్ గురువారం ‘విజయక్రాంతి’తో చెప్పారు.

కలెక్టర్ ఆదేశాలతో విచారణ

రైతులు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారిణి భాగ్యలక్ష్మి, మండల వ్యవసాయాధికారి పశుపతితోపాటు మరో అధికారిణి గురువారం గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీకి వచ్చి వివరాలను సేకరించినట్టు తెలిసింది. దాదాపు 6 వేల మంది రైతుల పేరుపై రుణాలు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అడ్లూర్ ఎల్లారెడ్డి ఫ్యాక్టరీలో ౨,౬౬౪ మంది పేర్లతో రుణం తీసుకున్నట్టు యాజమాన్యం చెప్పిం ది. మాగి ఫ్యాక్టరీలో రుణాల వివరాలు ప్రకటించకపోవడం గమనార్హం.

అధికారులు దీనిని కామన్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం. రైతులను మోసం చేసిన గాయత్రీ ఫ్యాక్టరీ యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపించేలా చొరవ చూపాలని జిల్లా ఎమ్మెల్యేలకు రైతులు విజ్ఞప్తిచేశారు. లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. సమగ్రమైన విచారణ జరిపే వరకు రైతులందరితో కలిసి ఫ్యాక్టరీని ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ దశరథ్‌రెడ్డి, లింగారెడ్డి రైతులు పేర్కొన్నారు.

రైతులను మోసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

రైతులను మోసం చేసిన గాయ త్రీ, మాగీ కంపెనీతోపాటు బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలి. రైతులకు రావాల్సిన రుణమాఫీ డబ్బులను ఇప్పించాలి. రైతులకు తెలియకుండా రుణాలు తీసుకోవడం నేరం. 20 ఏళ్లుగా తీసుకున్నామని ఫ్యాక్టరీ అధికారులు చెప్పడం దారుణం. చర్యలు తీసుకోకపోతే రైతులందరం కలిసి పోరాటం చేస్తాం.  

 గంగారాజు, రైతు, పోసానిపేట్,కామారెడ్డి

20 ఏళ్లుగా ఫ్యాక్టరీ మమ్మల్ని మోసం చేసింది

నాకు ఐదు ఎకరాల చెరుకు తోట ఉంది. ఎకరాకు వేలల్లో నిజామాబాద్ బ్యాంక్‌లో నాకు సమాచారం ఇవ్వకుండానే యాజమాన్యం రుణం తీసుకున్నది. వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి ఫోన్‌కు మేసేజ్ వచ్చింది. లోన్ గురించి వ్యవసాయధికారులను ప్రశ్నిస్తే నిజామాబాద్ యూనియన్ బ్యాంక్‌లో రుణం ఇచ్చినట్టు చెప్పారు. ఫ్యాక్టరీ వాళ్లను ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా, రుణమాఫీ డబ్బులను ఇస్తామని చెప్తున్నారు. గతంలో రెండుసార్లు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అప్పడు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యమే లాభపడింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.

 భూమయ్య, రైతు, పాతరాజంపేట్, కామారెడ్డి