26-07-2024 04:30:06 AM
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి)/నెట్‌వర్క్: రాష్ట్రంలో ప్రాజెక్టులకు వరద స్థిరంగా పెరుగుతోంది. కృష్ణానదికి అంతకంతకు వరద ఎక్కువవుతుంటే.. గోదావరిలో నిలకడగా కొనసాగుతంది. ప్రాణహిత, ఇంద్రావతి నుంచి వరద రావడంతో దుమ్ముగూడెం, భద్రాచలం వద్ద సుమారు 10 లక్షలకుపైగా క్యూసెక్కుల వరద వృథాగా దిగువకు పోతోంది. కృష్ణాబేసిన్‌లో తుంగభద్ర నది నుంచి వరుసగా రెండో రోజు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. తుంగభద్రకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోందని క్రమంగా ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లోను పెంచుతామని అధికారులు తెలిపారు.
జూరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరుగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. పవర్ జెనరేషన్ ద్వారా శ్రీశైలానికి 31754 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో సాగర్‌కు శ్రీశైలం నుంచి ఇదే తొలి వరద కావడం విశేషం. గోదావరిలో మేడిగడ్డ వద్ద వరద ఉధృతి తగ్గింది. భద్రాచలం వద్ద కూడా 10 లక్షలకు పైగా వరద ప్రవహిస్తున్నా గత రెండు రోజులతో పోలిస్తే తగ్గింది.
మూసీ కుడి కాల్వకు నీటి విడుదల
మూసీ కుడి కాల్వకు గురువారం నీటిని విడుదల చేశారు. కుడి కాల్వ పరిధిలో నకిరేకల్, మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ నియోజకవర్గల్లో దాదాపు 33 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగు నీటి విడుదలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెడ్ అలర్ట్ జారీ
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించిన వాతావరణశాఖ ఆయా జిల్లాలకు రెడ్ అల ర్ట్ జారీ చేసింది. అల్పపీడనం కారణంగా మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయంది. గురువారం నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లలో మోస్తరు వర్షపాతం నమోదైంది.
భద్రాచలం వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. గురువారం సాయం త్రం 7 గంటలకు 48.40 అడుగులకు చేరుకొంది. గురువారం మధ్యా హ్నం 1.10 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ జితేష్ వీ పాటిల్ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

