14-07-2025 12:00:00 AM
* గుట్టు రట్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు
* టన్ను బెల్లం, 50 కిలోల పటిక పట్టివేత
* ముగ్గురిపై కేసు, బైక్ సీజ్
హుస్నాబాద్, జూలై 13 : అమాయక ప్రజల జీవితాలను నాశనం చేస్తూ, కిరాణం దుకాణం ముసుగులో గుడుంబా దందా నడుపుతున్న ఒక ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలకేంద్రంలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న బింగి చంద్రమౌళి, ఆయన భార్య శారద తమ కిరాణం షాపును అడ్డం పెట్టుకొని, గుడుంబా తయారీకి అవసరమైన బెల్లం, పటికలను అక్రమంగా విక్రయిస్తున్నారు.
పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు, ఒక టన్ను బెల్లం, 50 కిలోల పటికను స్వాధీనం చేసుకొని, ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఒక బైక్ను సీజ్ చేశారు. హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం రాత్రి (జూలై 12) అక్కన్నపేట వద్ద రూట్ వాచ్ నిర్వహిస్తుండగా, బొత్తలపర్రె తండాకు చెందిన భూక్య రమేశ్ తన హీరో ప్యాషన్ ప్రో బ్పై అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని ఆపి తనిఖీ చేయగా, 5 కిలోల పటిక, 20 కిలోల బెల్లంతో పాటు 2 లీటర్ల గుడుంబా లభ్యమైంది.
రమేశ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా, ఈ బెల్లం, పటికను అక్కన్నపేటకు చెందిన బింగి చంద్రమౌళి, శారదల కిరాణం దుకాణం నుంచే కొనుగోలు చేసినట్టు వెల్లడించాడు. దీంతో ఎక్సైజ్ అధికారులు బింగి చంద్రమౌళి, శారదల నివాసంతో పాటు వారి కిరాణం దుకాణంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ పరిమాణంలో 980 కిలోల బెల్లం, 45 కిలోల పటిక బయటపడ్డాయి. మొత్తంగా, ఈ ఆపరేషన్లో 1000 కిలోల బెల్లం, 50 కిలోల పటిక, 2 లీటర్ల గుడుంబా, భూక్య రమేశ్ ఉపయోగించిన ప్యాషన్ ప్రో బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పవన్ తెలిపారు. బింగి చంద్రమౌళి, శారద, భూక్య రమేశ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.
ఈ దాడుల్లో ఎస్త్స్రలు రూప, దామోదర్ సహా సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన బద్దం రాజు, సతీశ్, రవీందర్, విజయ్లను సీఐ పవన్ అభినందించారు. కిరాణం దుకాణం మాటున జరుగుతున్న ఈ గుడుంబా దందా గుట్టు రట్టు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.