15-01-2026 03:10:01 AM
మేడారం జాతరకు అంకురార్పణ
మేడారం, జనవరి 14 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి బుధవారం గుడి మెలిగే పండుగతో అంకురార్పణ జరిగింది. అత్యంత నియమ నిష్టలతో పూజారులు గుడిని నీటితో శుద్ధిచేసి, డోలి వాయిద్యాలతో కుటుంబ సభ్యులతో కలిసి అడవికి వెళ్లి గుట్ట గడ్డిని తీసుకొని వచ్చి పసుపు కుంకుమలతో పూజలు చేసిన తర్వాత మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరాలపై అలంకరించారు. అలాగే వనదేవతల పూజా సామగ్రిని శుద్ధి చేసి అలంకరించారు. ఆలయాల ఆవరణను ముగ్గులతో ప్రవేశ మార్గాల్లో మామిడి తోరణాలు కట్టి ముస్తాబు చేశారు.
మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన మునేందర్, కన్నేపల్లి సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాక సారయ్య, కిరణ్ ఆధ్వర్యంలో గుడి మెలిగే వేడుక అత్యంత వైభవంగా వనదేవతల వంశీయులు, పూజారులు, ఆదివాసి సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. ఈ నెల 21న మేడారం జాతర నిర్వహణకు శక్తిని ప్రసాదించాలంటూ వనదేవతలను వేడుకుంటూ మండ మెలిగే పండగ నిర్వహిస్తారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో గుడి మెలిగే పండగ అంకురార్పణగా, మండ మెలిగే పండగ తొలి అంకంగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో మేడారం సర్పంచ్ సిద్దబోయిన భారతి వెంకన్న పాల్గొన్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు దేవాలయం లో పెనుక వంశీయులు, ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో గోవిందరాజుల పూజారులు, దెబ్బ గట్ల వంశీయులు మండమెలిగే పండగ నిర్వహించారు.
మేడారంలో భక్తుల రద్దీ
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు మరో 13 రోజుల గడువు ఉండగా, ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తరలి వస్తుండటంతో మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓవైపు భక్తులకు ఇబ్బందులు కలగకుండా మరోవైపు జాతర అభివృద్ధి పనులు నిర్వహించడానికి అధికారులు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సీఎం రేవంత్ ఈ నెల 18న మేడారం రానున్నారు. ఆరోజు రాత్రి ఇక్కడే బస చేసి, 19న గద్దెల పునరుద్ధరణ పనులను ప్రారంభించడంతోపాటు తొలిసారిగా రాష్ట్ర రాజధాని హైదరా బాదులో కాకుండా మేడారంలో రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు.