calender_icon.png 22 November, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానగరానికి నిధుల వరద

26-07-2024 05:19:34 AM

  • బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు 
  • బల్దియా, హైడ్రాకు రూ.3,265 కోట్లు 
  • వాటర్ బోర్డుకు రూ.3,385 కోట్లు 
  • హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్ల కేటాయింపు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైదరాబాద్ మహానగరానికి పెద్దపీట వేసినట్లుగా స్పష్టమ వుతున్నది. హైదరాబాద్ చుట్టూ ఉన్న సంస్థలకే పెద్ద మొత్తంలో కేటాయించారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.2,91,159 కోట్లలో రూ.10 వేల కోట్లు హైదరాబాద్‌కు కేటాయించారు. దీంతో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తున్నది. 

ఊపిరి పీల్చుకోనున్న బల్దియా

గతేడాది బీఆర్‌ఎస్ హయాంలో జీహెచ్‌ఎంసీకి, వాటర్‌బోర్డుకు నిధులు కేటాయిం పులు లేని కారణంగా అప్పులతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అప్పులకు ప్రతినెలా కోట్లాది రూపాయల వడ్డీ చెల్లిస్తున్నాయి. బల్దియా నిర్వహణ అంతా ఆస్తి పన్ను వసూళ్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. జీహెచ్‌ఎంసీలో వివిధ అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో  ఉన్న రూ.1,500 కోట్ల చెల్లింపు కూడా తలనొప్పిగా మారింది.

కాంట్రాక్టర్లు రెండు రోజులుగా నిరసనలకు కూడా దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రూ.3,065 కోట్లు కేటాయించడం బల్దియా కు కాస్తా ఊపిరీ పీల్చుకునే అవకాశం లభించింది. అయితే, ఫిబ్రవరిలో ప్రభుత్వం పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,100 కోట్లలో ఒక్క పైసా కూడా రాకపోవడంపై అధికారులు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు త్వం ప్రకటించిన భారీ నిధులు ప్రకటనలకే పరిమితం కాకుండా విడుదల చేయాలని బల్దియా పాలక మండలి కోరుతున్నది. 

హైడ్రాకు, మూసీకి రూ.3,500 కోట్లు

హైదరాబాద్ మహానగరంలో ఇటీవలే ఏర్పడిన హైదరాబాద్ డిజాస్టార్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు తొలి బడ్జెట్‌లోనే రూ.200 కోట్లను కేటాయించడం విశేషం. మూసీ సుందరీకరణ పేరుతో చేపడుతున్న మరో కొత్త ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు, ఓఆర్‌ఆర్‌కు రూ.200 కోట్లు, వాటర్ వర్క్స్‌కు రూ.3,385 కోట్లు, పాతబస్తీకి మెట్రోను విస్తరించేందుకు రూ.500 కోట్లు, శంషాబాద్‌కు మెట్రో విస్తరణ పనులకు రూ.100 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.500 కోట్లతో పాటు మల్టీ మోడల్ సబ్ అర్బన్ రైలు ట్రాన్స్‌పోర్టుకు రూ.50 కోట్లతో మొత్తం రూ.10 వేల కోట్లను కేటాయించింది. వీటితో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో రూ.1,525 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.