26-07-2024 05:13:31 AM
న్యూఢిల్లీ, జూలై 25: రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లను మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దర్బార్ హాల్‌ని గణతంత్ర మండపంగా, అశోక్ హాల్‌ని అశోక్ మండపంగా మార్చింది. రాష్ట్రపతి భవన్ భారత ప్రజల అమూల్యమైన వారసత్వం. అందుకే, రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బ్రిటీష్ కాలం నాటి ‘దర్బార్’ అనే పదాన్ని తొలగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఒకప్పుడు భారతదేశాన్ని పాలించిన బ్రిటీషర్లు ఈ పేరు పెట్టుకున్నారని, ఇప్పుడు భారత్ గణతంత్ర దేశంగా మారిపోయిందని తేల్చిచెప్పింది.
“దర్బార్ అనే పదం బ్రిటీష్ వాళ్లు భారత్‌ని పరిపాలించినప్పుడు వాడిన పదం. ఈ పదానికి కాలం చెల్లిపోయింది. ప్రస్తుతం మనం గణతంత్ర దేశంలో ఉన్నాం. పైగా గణతంత్ర అనే పదానికి భారత్‌కి విడదీయరాని బంధం ఉంది. అందుకే దర్బార్ హాల్‌కు గణతంత్ర మండప్ పేరు పెడుతున్నాం. అశోక చక్రవర్తికి గౌరవ సూచకంగా ఓ హాల్‌కు అశోక మండప్ అనే పేరు పెట్టాం” అని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. అశోక్ అంటే ఎలాంటి బాధలు లేకపోవడం అని అర్థం.
పైగా అశోక చక్రవర్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతియుత జీవ నం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన అశోకచక్రవర్తికి గౌరవంగా ఈ పేరు పెట్టినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అశోక్ హాల్‌ను విందు కోసం వినియోగిస్తారు.
ప్రియాంకా గాంధీ కౌంటర్ అటాక్..
రాష్ట్రపతి భవన్‌లోని హాళ్ల పేర్ల మార్పుపై నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ మండిపడ్డారు. షెహన్షా (రాజు) అనే భావన దేశంలో ఇప్పటికీ ఉందన్నారు. ‘దర్బార్ అనే కాన్సెప్ట్ లేదు సరే కానీ షెహన్షా అనే కాన్సెప్ట్ ఉంది.. ఇంట్రెస్టింగ్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు
మేడమ్... ప్రెసిడెంట్
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. రెండేళ్ల ప్రయాణం పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం ఆమె ఢిల్లీలోని ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయలోని 9వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులతో సరదాగా గడిపారు. తనకు టీచర్ జాబ్ అంటే ఎంతో ఇష్టమని అన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ వార్మింగ్, నీటి సంరక్షణ అనే అంశాలపై విద్యార్థులకు బోధించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అఅని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన మేరకు ‘ఏక్ పేడ్ మా కే నామ్’ను ప్రస్తావిస్తూ ప్రతీ విద్యార్థి తన జన్మదినం రోజున ఒక మొక్కను నాటాలని కోరారు. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలని.. దుబారా చేయవద్దని సూచించారు. కాగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన తొలి ఆదివాసీ వ్యక్తిగా రికార్డులకెక్కారు.