calender_icon.png 15 May, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు కడుపునిండా సన్నబియ్యం

07-04-2025 12:19:01 AM

దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ 

దేవరకొండ, ఏప్రిల్ 6 : పేదలు కడుపునిండా తినాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ స్పష్టం చేశారు. గుడిపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు అధికారులతో కలిసి ఆదివారం సన్నబియ్యం పంపిణీ చేసి ఆయన మాట్లాడారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 80 శాతం మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. సన్నధాన్యాన్ని పండించేలా రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి సర్కారు ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. వేల కోట్ల సబ్సిడీ భరిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నదొడ్డు బియ్యాన్ని ప్రజలు తినేందుకు ఇష్టపడకపోవడం, దుర్వినియోగం అవుతుండడంతో వాటి స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారని తెలిపారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందన్నారు. అర్హులందరికీ త్వరలో రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  అనంతరం గ్రామంలోని ఓ దళిత లబ్ధిదారు ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు.