22-08-2025 12:17:33 AM
మహబూబాబాద్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా మల్యాల లోనే హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కి మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు.
హార్టికల్చర్ యూనివర్సిటీ కెవికె మల్యాల లో ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలము, ఇతర మౌలిక వసతులు ఉన్నాయని, మరోచోటికి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు.
దీనికి స్పందించిన వేం నరేందర్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి మల్యాల లోనే హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తమ విజ్ఞప్తిని పరిశీలించి వెంటనే ఆదేశాలు జారీ చేసినందుకు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.