08-01-2026 12:44:37 AM
రాయ్‌పూర్, జనవరి7: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం ఏకంగా 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 13 మందిపై రూ.64 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయినవారిలో పార్టీ అగ్రనేత, పార్టీ డిప్యూటీ కమాండర్ లాలీ అలియాస్ ముచాకీ ఆయతే, ప్లాటూన్ కమాండర్ హెమ్లా లఖ్మా అగ్రనేతలు కూడా ఉన్నారు. వీరు 2017లో కోరాపుట్‌లో జరిగిన ఐఈడీ పేలుడు, 2020 నాటి మిన్పా అడవుల్లో జరిగిన దాడుల్లో క్రియాశీల పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.
అలాగే 22 మంది జవాన్ల మృతికి కారణమైన 2021 టేకులగూడెం ఘటనలో పాల్గొన్న ముచాకీ సందీప్ అలియాస్ హిడ్మా కూడా లొంగిపోయిన వారి జాబితాలో ఉన్నారు. మావోయిస్టుల అగ్రశ్రేణి విభాగమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బెటాలియన్-1 కు సుక్మా జిల్లాలో ఈ పరిణామం కోలుకోలేని దెబ్బ అని అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ‘పూనా నార్కోంస పునరావాస’ పథకాలకు ఆకర్షితులైన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని పోలీసులు తెలిపారు.
మిగిలిన వారిని కూడా లొంగిపోయేలా చేసేందుకు వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తక్షణ 50వేల నగదును అందజేశామని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. 2025 నాటి కొత్త పునరావాస విధానం ప్రకారం వీరికి గృహనిర్మాణం, ఉపాధి శిక్షణ, ఉచిత విద్య వంటి సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.