04-01-2026 12:00:00 AM
సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమైన నాగోబా జాతర దేశంలోనే అదివాసీ గిరిజనులు జరుపుకునే రెండో అతిపెద్ద వేడుకగా ప్రసిద్ధి. ప్రతియేటా పుష్యమి మాసంలో నిర్వహించే జాతరకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉండే గిరిజన తెగలు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆదివాసీల ఆరాధ్య దేవుడు నాగోబా జాతర అంటేనే నెల రోజుల వేడుక. వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను జాతరలో ఇప్పటికీ కొనసాగిస్త్తున్నారు.
ప్రతియేటా నెల రోజుల పాటు నిర్వహణ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేల్లాపూర్ గ్రామ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో వేల ఏళ్ల క్రితం నాగోబా కొలువుదీరారు. నాగోబా దేవుడికి మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన వారు నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. నాగోబా మహా పూజలను రాత్రి సమయంలో నిర్వహిస్తారు.
పూజల సందర్భంగా నాగోబా ప్రత్యక్షమై మెస్రం వంశస్థులు సమర్పించే పాలు తాగడంతో పాటు వారు సమర్పించే నైవేద్యం చూసిన తర్వాతనే జాతరను ప్రారంభిస్తారు. నాగోబా జాతరకు ఉమ్మడి జిల్లా తో పాటు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా ప్రాంతాల నుంచి గిరిజనులు తరలివస్తారు.
తరతరాల నుంచి వస్తున్న ఆచారం..
ఇంద్రవెల్లి మండలం కేషాపూర్‌లో 1942 ముందు అప్పటి మెస్రం వంశం పెద్ద మార్ జీ పటేల్ ఆడవిలోని పుట్టకు మొక్కి పూజలు నిర్వహించే వారు. ఆయన తర్వాత బారు పటేల్ పందిరి నీడలో దేవుడికి మొకులు తీర్చుకునే వారు. బారు పటేల్ నాగోబా ప్రత్యక్షమయ్యే వరకు పిల్లన గ్రోవితో పాటలు పాడేవారని మెస్రం వంశ పెద్దలు తెలిపారు. ఆయన తర్వాత ఆలయ పీఠాధిపతిగా మెస్రం దేవరావు పటేల్ 1912 లో నాగోబాకు పందిరిని ఏర్పాటు చేశారు. ఆలయ పీఠాధిపతిగా మెస్రం దేవురావు పటేల్ 1960, 1977లో నాగోబాకు ఆలయం నిర్మించారు.
తర్వాత 1995లో తెలుగు దేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన గోడం నగేష్ మెస్రం మంశస్థులు తమ వంతు కార్పస్ ఫండ్ గా రూ. 80 చెల్లిస్తే ఆలయ నిర్మాణానికి రూ 4.80 లక్షలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మెస్రం వంశస్థులు చందాలు వేసి అప్పటి ప్రయత్వానికి రూ.80 వేలు చెల్లించారు. 1996లో ఆలయం నిర్మాంచారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత నాగోబాకు నూతన ఆలయం నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినా మెస్రం వంశస్థులు తామే ఆలయం నిర్మించుకుంటామని ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావు ప్రకటించారు. అనంతరం మెస్రం వంశస్థులు రూ. 5 కోట్లతో నూతన నాగోబా ఆలయాన్ని 2022లో పూర్తి చేశారు. దాతల సహాయం లేకండా, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోకుండా దేశ చరిత్రలోనే మెస్రం వంశస్థులు నిలిచి పోయారు.
180 కి.మీ పాదరక్షలు లేకుండా పాదయాత్ర
కేశ్వపూర్‌లోని నాగోబా జాతరను ఏటా పుష్యమి మాసం ప్రారంభంలో నెలవంకను చూసి మహా పూజలతో ప్రారంభిస్తారు. నెలవంక దర్శనం తర్వాత మరుసటి రోజున మెస్రం వంశస్థులలో నాగోబా దేవుడి పూజారి, ప్రధాన్ ప్రచార రథంలో ఏడు రోజుల పాటు ప్రచారం చేస్తారు.
ఏడు రోజుల ప్రచారం తర్వాత మరుసటి రోజు వండలాది మందితో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గ్రామం పక్కన ప్రవహించే గోదావరిలోని హస్తిన మడుగు నుంచి పవిత్ర గంగా జలం తీసుకువస్తారు. కేస్లాపూర్ నుంచి గోదావరికి వెళ్లేందుకు 7 రోజుల సమయం తీసుకుంటారు. దాదాపు 180 కిమీ దూరం పాదరక్షలు లేకుండా కాలినడకతో వెళ్లి తిరిగివస్తారు.
అందరూ వరుస క్రమంలోనే..
కేసాపూర్ నుంచి పవిత్ర గంగా జలం కోసం నడకతో బయలు దేరిన మెస్రం వంశస్థులు వరుస క్రమంలోనే పయనిస్తారు. తెలుపు వస్త్రాలు ధరించి, ముందుగా ప్రధాస్ నడుస్తుంటే మెస్రం వంశస్థలు అనుసరిస్తారు. గంగాజలం కోసం వెళ్లే క్రమంలో అటవీ జంతువులు దాడి చేస్తాయని, వాటి నుంచి రక్షించుకునేందుకు వరుస క్రమంలో నడిచివెళ్లడం అనవాయితీగా వస్తోంది.
మట్టి కుండలోని నీటితో అలయ శుద్ధి
నాగోబా మహాపూజ నాడు మెస్రం వంశం మహిళలు మట్టి కుండలతో మర్రి చెట్ల వద్ద గల కోనేరు నుంచి తీసుకొచ్చిన నీటితో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆ నీటితో ఆలయం పక్కన రెండు మట్టి పుట్టలను తయారు చేస్తారు. పుట్టలను మట్టితో తయారు చేసే సమయంలో మెస్రం వంశం అల్లుళ్లతో పాటు ఆడపడుచులలకు పెద్ద పీట వేస్తారు.
ఆలయం పక్కన వేసిన పుట్టలతో ఏడాది పాటు పంటలు ఎలా ఉంటాయి. ప్రజల ఆరోగ్యల ఏలా ఉంటుందో మేస్రం వంశస్థులు గుర్తిస్తారు. నాగోబా మహాపూజలు వాడే నూనె ను కేస్లపూర్ గ్రామంలోని మురాడి ఆలయం పక్కన గల గానుగ నుంచి నువ్వుల నూనెను తీస్తాడు. ఆ నూనె తోనే నాగోబాకు దీపాలు వెలిగిస్తారు.
కొత్త కోడళ్ల పరిచయం
మెస్రం వంశీయుల్లోని 22 తెగల వారు కుటుంబ సమేతంగా మర్రిచెట్ల నీడలో సేదదీరుతారు. మట్టి కుండలో జొన్న గటక, సాంబారు వండి నైవేద్యంగా సమర్పిస్తారు. కొత్త కోడళ్ల ను నాగోబా దేవుడి కి పరిచయం (బేటింగ్) చేస్తారు. ఆదివాసీ గిరిజనుల ఆచారాల ప్రకారంగా కార్యక్రమం జరుగుతుంది.
అధికారికంగా ప్రజాదర్బార్..
నాగోబా సన్నిధానంలో అధికారికంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిం చే ఈ ప్రజాదర్బార్ కు రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అదికారులు పాల్గొంటారు. ఆదివాసీల సమస్యలను పరిష్కారంపై చర్చిస్తారు. ఈ ప్రజాదర్బార్ 1912 నుంచి పరంపర కొనసాగుతుంది. ఈ ప్రజాదర్బార్ 1990లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిజనులు దరాఖాస్తు చేసుకుంటే రాష్ట్ర అధికారులకు వాటి ప్రతులను పంపారు. నాగోబా ధర్బార్ నుంచి వెళ్లిన దరఖాస్తులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించని దాఖలాలు సైతం ఉన్నాయి.
గంగ నీళ్లతో తీయని అప్పాలు
నాగోబా మహాపూజకు అవసరమయ్యే గంగా జలం కోసం బయల్దేరిన మెస్రం వంశీయులు ముందుగా గోధుమ, బెల్లం కలిపిన పిండిలో అప్పాలను తయారు చేసి గంగాదేనికి వైపధ్యంగా సమర్పిస్తారు. అనంతరం మెస్రం వంశం కటోడ మెస్రం హనుమంతుతో పాటు ప్రధాన్ దాదే రావులు కలశంలో గంగానీరు సేకరించి నాగోబా ఆలయానికి తిరుగు ప్రయాణమవుతారు.
బండారి లక్ష్మి నర్సయ్య, ఉట్నూర్ (విజయక్రాంతి)