22-11-2025 01:25:48 AM
కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, నవంబర్ 21(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లాలో చిత్తడి నేలల ( వెట్ ల్యాండ్స్) జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో చిత్తడి నేలల (సంరక్షణ, నిర్వహణ) నియమాలు, 2017 ప్రకారం తడి భూముల నోటిఫికేషన్ - రాష్ర్ట ఉత్తర్వులలో చిత్తడి నేలల సర్వే, సరిహద్దులు మరియు నోటిఫికేషన్ కోసం జిల్లా తడి భూముల కమిటీ ఏర్పాటు చేశారు.
ఆ కమిటీకి చైర్మన్ గా అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నోటిఫికేషన్ ప్రచురించబడిన తేదీ నుండి 3 నెలల్లోపు జిల్లాలోని అన్ని చిత్తడి నేలల జాబితాను సిద్ధం చేయాలని, 6 నెలల్లోపు తెలియజే యవలసిన చిత్తడి నేలల జాబితాను సిద్ధం చేయాలని ఆమె తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం నియంత్రణ కోసం, వాటి సంక్షిప్త పత్రాల ఆధారంగా గుర్తించబడిన చిత్తడి నేలలను సిఫార్సు చేయాలన్నారు. ఒక సంవత్సరం లోపు అన్ని చిత్తడి నేలల సమగ్ర డిజిటల్ జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు.
ప్రతి జిల్లాలో ఒక జిల్లా తడి భూముల కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ హైదరాబాద్ ప్రధాన అటవీ సంరక్షణాధికారి అభ్యర్థన మేరకు నారాయణ పేట జిల్లా చిత్తడి నేలల కమిటిని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్ మెంబర్‌గా జిల్లా అటవీ శాఖ అధికారితోపాటు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్లతో కూడిన 7 మంది సంబంధిత శాఖల అధికారుల బృందం కమిటీ ఉండనుంది. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారి బ్రహ్మ నంద రెడ్డి పాల్గొన్నారు.